టీడీపీ దోపిడీపై పోరాడుతా : పవన్ కళ్యాణ్

21:27 - July 7, 2018

విశాఖ : వచ్చే ఎన్నికల్లో తాను అధికారంలోకి రాకపోయినా... టీడీపీ దోపిడీపై పోరాడుతానని స్పష్టం చేశారు జనసేనాని. ఉత్తరాంధ్ర పోరాటయాత్ర ముగింపు సందర్భంగా టీడీపీ పాలనపై విరుచుకుపడ్డారు. ఉత్తరాంధ్ర అభివృద్ధిని గాలికొదిలేసిన సర్కార్‌... గిరిజన, దళితుల భూములను విచ్చలవిడిగా లాక్కుంటుందన్నారు. టీడీపీ దోపిడీకి అడ్డుకట్ట వేయడానికి కార్యకర్తలంతా పోరాడాలని జనసేనాని పిలుపునిచ్చారు. 

జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ పోరాటయాత్ర ముగింపు సందర్బంగా విశాఖ ఆర్కే బీచ్‌లో నిరసన కవాతు నిర్వహించారు. ఈ కవాతులో అభిమానులు, కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు. ప్రత్యేక హోదా, విభజన హామీలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరును నిరసిస్తూ ఈ కవాతు కొనసాగింది. ప్రజా సమస్యలపై గళమెత్తడంతోపాటు ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారు పవన్‌కల్యాణ్‌. రాష్ట్రంలో టీడీపీ దోపిడీ పెరిగిపోయిందన్నారు. కష్టాల్లో ఉన్న రాష్ట్రం అభివృద్ది చెందాలంటే అనుభవం ఉన్న నేత కావాలని చంద్రబాబుకు మద్దతిస్తే.. అధికారంలోకి వచ్చిన తర్వాత విపరీతంగా అవినీతికి పాల్పడుతున్నారన్నారు. ఎలాంటి ప్రయోజనం లేకపోతే చంద్రబాబు ఏ పని చేయరని పవన్‌కల్యాణ్‌ విమర్శించారు. తమ ప్రయోజనాల కోసం ఉత్తరాంధ్ర అడ్డంగా దోచేస్తున్నారన్నారు. గత ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి రావడానికి తన మద్దతు ఎంత ఉపయోగపడిందో... వచ్చే ఎన్నికల్లో అంతే బలమైన ప్రత్యర్ధిని అని పవన్‌కల్యాణ్‌ స్పష్టం చేశారు. 

విశాఖ రైల్వే జోన్‌ కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజీనామా చేసి ఉద్యమంలో పాల్గొనాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ పిలుపునిచ్చారు. నలుగురు తలుచుకుంటే... విశాఖ రైల్వేజోన్‌ సాధ్యమన్నారు. చంద్రబాబు, లోకేశ్‌, జగన్‌తో కలిసి రైళ్లను స్తంభింపజేసేందుకు తాను సిద్ధమని.. వాళ్లు సిద్దమా ? అని సవాల్‌ విసిరారు. చంద్రబాబుకు ప్రధాని మోదీ అంటే భయమని.. అందుకే ప్రత్యేకహోదాపై గట్టిగా పోరాటం చేయడం లేదన్నారు. 

తనకు డబ్బుపై ఆశలేదని... స్వచ్చమైన రాజకీయాలు చేసేందుకు సిద్దంగా ఉన్నానన్నారు పవన్‌కల్యాణ్‌. ప్రజల కష్టాలు ప్రత్యక్షంగా చూశానని.. ఎన్నికల్లో గెలవకపోయినా... ప్రభుత్వ దోపిడీలపై పోరాడుతానన్నారు. చంద్రబాబు దళిత తేజం అని చెప్పి.. దళితుల భూములనే లాక్కుంటున్నారన్నారు. టీడీపీ నేతల అవినీతి, అక్రమాలపై జనసేన సైనికుల్లా పోరాడుతుందన్నారు జనసేనాని.  ఉత్తరాంధ్ర పర్యటనలో టీడీపీపై విమర్శలు చేస్తున్న పవన్‌కల్యాణ్‌... పోరాటయాత్ర ముగింపు యాత్రలో స్వరం పెంచారు. టీడీపీ దోపిడీకి ప్రజలంతా అడ్డుకట్ట వేయాల్సిన అవసరముందని ఈ సందర్భంగా పవన్‌కల్యాణ్‌ స్పష్టం చేశారు. 

Don't Miss