రాజకీయం కోసం కాదు : పవన్

20:52 - July 30, 2017

విశాఖ : ఉద్దానం కిడ్నీ జబ్బులపై హార్వర్డ్ యూనివర్శిటీ వైద్యుల బృందంతో జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ విశాఖలో సమావేశ అయ్యారు. శనివారం ఉద్దానంలో పర్యటించి అధ్యయనం చేసిన వివరాలను హార్వర్డ్స్ వైద్యులు పవన్‌కు వివరించారు. ఉద్దానం కిడ్నీ సమస్యను రాజకీయాలకు అతీతంగా పరిష్కరించాలన్నారు పవన్. ఈ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. గత పాలకులు ఈ సమస్యను పట్టించుకోలేదని ఈ ప్రభుత్వం అయినా స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరారు. సమస్య పరిష్కారానికి అవసరమైతే ప్రతిపక్ష వైసీపీ మద్దతు కూడా కోరతానన్నారు. ప్రజల కోసం పనిచేయడానికి ఎవరు తనతో కలిసి వచ్చినా ఆహ్వానిస్తానని పవన్‌ పేర్కొన్నారు. ఉద్దానంలో కిడ్నీవ్యాధులకు శాశ్వత పరిష్కారం చూపినప్పుడే తన ప్రయత్నం ఫలించినట్లని పవన్‌ కల్యాణ్‌ అన్నారు. తాను చేస్తున్న ఈ ప్రయత్నం ప్రజల కోసమే గానీ.. రాజకీయాల కోసం కాదని స్పష్టం చేశారు. మానవత్వం మంటగలుస్తున్నా పోరాడేవారు లేకపోవడం బాధాకరమన్నారు. సమస్య పరిష్కారం కావాలన్నదే తన అభిమతమని, మనిషి మేధస్సు ఉద్దానం సమస్యను పరిష్కరించగలదని పవన్ అభిప్రాయపడ్డారు. నల్గొండ జిల్లాలో ఫ్లోరైడ్ సమస్య ఎంతో కాలంగా వేధిస్తోందని, దాని పట్ల చిత్తశుద్ధితో స్పందిస్తే విమర్శలు చేశారని గుర్తు చేశారు.

సమస్యల పట్ల మానవత్వంతో
తాను ప్రభుత్వాలకు కాదు...ప్రజలకు సేవ చేస్తానని పవన్ స్పష్టం చేశారు. మన తోటి మనుషులు బాధపడుతుంటే పరిష్కారం వెదక్కుండా రాజకీయాలు చేయడం దారుణమని అన్నారు. ఇలాంటి సమస్యల పట్ల మానవత్వంతో స్పందిస్తే దానిని నివారించడం పెద్ద కష్టం కాదని అన్నారు. ఉద్దానంలో కిడ్నీ సమస్య తీవ్రంగా ఉందని హార్వర్డ్‌ యూనివర్సిటీ వైద్యులు అన్నారు. బాధితుల శాంపిల్స్‌ ఎప్పటికప్పుడు సేకరించి విశ్లేషించాలని, బయో మార్కర్స్‌తో వ్యాధి తీవ్రతను గుర్తించి...సమస్య తీవ్రం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని డాక్టర్‌ జోసెఫ్‌ సూచించారు. ఉద్దానంతో పాటు శ్రీలంక, సెంట్రల్‌ అమెరికా, యూరప్‌ దేశాల్లో కూడా కిడ్నీ వ్యాధి ఉందని అన్నారు. కిడ్నీ వ్యాధిపై పరిశోధనలు జరుగుతున్నాయని, వ్యాధి మూలాలు అంతుబట్టడం లేదని డాక్టర్‌ రవిరాజు పేర్కొన్నారు. ఉద్దానం సమస్యపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టిసారించిందని, బాధితులకు అవసరమైన వైద్యం అందిస్తున్నామని ఆయన తెలిపారు. కిడ్నీ సమస్యపై అధ్యయనానికి ప్రపంచ స్థాయి రీసెర్చ్‌ సెంటర్‌ను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని మరో డాక్టర్‌ సుధాకర్‌ అన్నారు. సమస్యను ప్రాథమిక దశలోనే గుర్తిస్తే నివారణ సులభం అవుతుందని అభిప్రాయపడ్డారు.

చంద్రబాబుతో భేటీ
ఉద్దానం సమస్యపై ఎప్పటికప్పుడు డేటా సేకరించి ప్రపంచ పరిశోధకుల దృష్టికి తీసుకెళ్తే పరిష్కారం లభిస్తుందని, ప్రపచంలోనే అతికొద్ది ప్రాంతాల్లో ఈ సమస్య ఉందని ఆయన అన్నారు. ఉద్దానంలో అయితే సమస్య తీవ్రంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు సోమవారం పవన్ కల్యాణ్ ముఖ్యమంత్రి చంద్రబాబుతో భేటీ కానున్నారు. ఉద్దానంలో హార్వర్డ్‌ యూనివర్సిటీ వైద్యుల బృందం చేపట్టిన అధ్యయన వివరాలను సీఎంకు సమర్పించనున్నారు. 

Don't Miss