వ్యూహం మార్చిన పవన్...

08:14 - September 30, 2018

పశ్చిమగోదావరి : జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ టిడిపిపై విమర్శల జోరును పెంచారు. నిన్న మొన్నటి వరకు చంద్రబాబు, ఆయన కుమారుడు లొకేష్‌లపై విమర్శలు గుప్పించిన పవన్‌ కళ్యాణ్...ఇపుడు వ్యూహం మార్చారు. పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటిస్తున్న పవన్-స్థానిక ఎమ్మెల్యేలను లక్ష్యంగా చేసుకున్నారు. టిడిపి ఎమ్మెల్యేలు అవినీతికి పాల్పడుతూ...ప్రజలను భయ భ్రాంతులకు గురిచేస్తున్నారని ఆరోపణలు చేస్తున్నారు.
దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ను ఏకంగా రౌడీ ఎమ్మెల్యేగా పవన్‌ పేర్కొన్నారు. ఆయనపై అనేక కేసులున్నాయని వ్యక్తిగత విమర్శలతో దాడి చేశారు. పవన్‌ కళ్యాణ్‌ సరికొత్త వ్యూహంపై టిడిపి హైకమాండ్‌ అప్రమత్తమైంది. పవన్‌ వ్యాఖ్యలు ప్రాంతాలు, కులాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ఉన్నాయని, దీనిపై సంయమనం పాటించాలని...వ్యక్తిగత విషయాల జోలికి వెళ్లకూడదని పార్టీనేతలకు స్పష్టం చేసింది. పవన్‌ కళ్యాణ్‌ వ్యక్తిగతంగా టార్గెట్‌ చేసినా రాజకీయంగానే తిప్పికొట్టాలని టిడిపి శ్రేణులకు సూచించింది..పవన్‌ కళ్యాణ్‌ తనపై వ్యక్తిగతంగా చేసిన వ్యాఖ్యలకు టిడిపి ఫైర్‌ బ్రాండ్‌గా పేరొందిన చింతమనేని వ్యవహరించిన తీరే ఇందుకు నిదర్శనం. దమ్ముంటే దెందులూరులో పోటీ చేసి గెలవాలంటూ రాజకీయంగా తిప్పికొట్టారే తప్ప వ్యక్తిగత విషయాల జోలికి వెళ్లలేదు. మొత్తానికి పవన్‌ కళ్యాణ్‌ విషయంలో టిడిపి ఆచి తూచి వ్యవహరిస్తోంది.

Don't Miss