'జనసేన' విజయం

19:24 - January 7, 2017

శ్రీకాకుళం : ఉద్ధానం కిడ్నీ సమస్యలపై ప్రభుత్వాన్ని తట్టి లేపడంలో జనసేన సక్సెస్‌ అయింది. జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ విధించిన డెడ్‌లైన్‌పై ఏపీ ప్రభుత్వం స్పందించి.. సమస్యను సీరియస్‌గా తీసుకుంటున్నట్లు తెలిపింది. ఇదే విషయాన్ని స్వయంగా పవన్‌ కల్యాణ్‌ ట్విట్టర్‌లో ట్వీట్‌ చేశారు. 
ఉద్దానం బాధితులపై సానుకూలంగా స్పందించిన ప్రభుత్వం 
శ్రీకాకుళం జిల్లాలో ఏళ్ల తరబడిగా పీడిస్తున్న కిడ్నీ వ్యాధి సమస్యపై..ప్రభుత్వాన్ని తట్టి లేపడంలో... జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ విజయం సాధించారు. మొన్న బాధితులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించిన ఆయన..స్వయంగా బాధితులతో మాట్లాడి వారి కష్టాలను తెలుసుకున్నారు. 48 గంటల్లోగా ప్రభుత్వం స్పందించాలని టీడీపీ సర్కార్‌కు డెడ్‌లైన్‌ విధించారు. దీంతో ఉద్దానం బాధితులపై ఏపీ ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన వచ్చింది. కిడ్నీ బాధితుల సమస్యలను ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంటుందని చంద్రబాబు ప్రకటించారు. సమస్య పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. 
సమస్యలపై జనసేన పోరాటం : పవన్ కళ్యాణ్ 
ఉద్దానం కిడ్నీ రోగుల విషయంలోనే కాకుండా ఇలాంటి సమస్యలు ఎక్కడున్నా అందుకు జనసేన పోరాడుతూనే ఉంటుందని పవన్ కల్యాణ్ ట్విట్టర్‌లో ట్వీట్‌ చేశారు. కిడ్నీ బాధితుల సమస్య తీవ్రత జిల్లా మంత్రి అచ్చెన్నాయుడు కంటే మెరుగ్గా.. సీఎం చంద్రబాబుకు అర్థమైందని ట్విట్టర్‌లో  పేర్కొన్నారు. ఉద్దానం బాధితుల సమస్య పూర్తిగా పరిష్కారం అయ్యేవరకు అన్ని పార్టీల మేనిఫెస్టోలో ఈ అంశం ఉండాలని పిలుపునిచ్చారు. 
సానుకూల స్పందన రావడంపై పవన్‌ హర్షం 
ఉద్దానం బాధితులపై ఏపీ ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన రావడంపై పవన్‌ హర్షం వ్యక్తం చేశారు. ఏపీ ప్రభుత్వం ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకుందని సమస్యలను పరిష్కరించే దిశగా అడుగులు పడతాయని పవన్ ధీమా వ్యక్తంచేశారు. మొత్తానికి కిడ్నీ వ్యాధి సమస్యపై స్పందించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చిన జనసేనకు స్థానికులు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నారు. 

Don't Miss