మార్పు కోసమే వచ్చా : పవన్

07:21 - January 25, 2018

ఖమ్మం : తెలంగాణలో జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ మూడురోజుల పర్యటన ముగిసింది. ప్రజాసమస్యలు తెలుసుకునేందుకు కొండగట్టు నుంచి ప్రారంభించిన రాజకీయ యాత్ర.. కరీంనగర్‌, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో కొనసాగింది. ఖమ్మంలోని ఎంబీ గార్డెన్స్‌లో ఉమ్మడి ఖమ్మం, వరంగల్‌, నల్లగొండ జిల్లాల కార్యకర్తలతో పవన్‌ కల్యాణ్‌ సమావేశమయ్యారు. అనంతరం కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. మార్పు కోసమే రాజకీయాల్లోకి వచ్చినట్టు పవన్‌ చెప్పారు. తెలుగు రాష్ట్రాల్లో యువత రాజకీయాల మార్పుపై దృష్టిపెట్టాలన్నారు. ఉడుకు నెత్తురుతో ఉన్న యువత తమతో కలిసి రావాలని కోరారు.

నల్గొండ ఫ్లోరైడ్‌ సమస్య కూడా కారణమని
తాను రాజకీయాల్లోకి రావడానికి నల్గొండ ఫ్లోరైడ్‌ సమస్య కూడా ఓ కారణమని పవన్‌ అన్నారు. బీఆర్‌ అంబేడ్కర్‌, ఫూలే విధానాలతో ముందుకెళ్తానని చెప్పారు. తనకు కులం, మతం లేదన్న పవన్‌.. మానవత్వం, జాతీయతను గౌరవిస్తానన్నారు. మన సమాజం కులవ్యవస్థతో ముడిపడి ఉందని.. కులవ్యవస్థను గౌరవించాలన్నారు. తనపై దాడులు చేసినా ఎదురుదాడి చేయనని పవన్‌ అన్నారు. ప్రజల కోసం ఏమైనా భరిస్తానని చెప్పారు. జనసేన ద్వారా ప్రజా సేవ చేసేందుకే ప్రజల్లోకి వచ్చానని పవన్‌ చెప్పారు. 'జై తెలంగాణ' 'జైహింద్‌' అన్న నినాదాలు తనకెంతో ఇష్టమన్నారు. తెలంగాణ జిల్లాల్లో ఉన్న సమస్యలను తెలుసుకుంటూ ప్రజలకు పరిష్కారాలు చూపేందుకు యాత్ర కొనసాగిస్తున్నట్లు తెలిపారు. ఏళ్లు గడిచినా నల్గొండ జిల్లావాసుల ఫ్లోరైడ్‌ సమస్యకు పరిష్కారం దొరకడం లేదన్నారు. ఫ్లోరైడ్‌ బాధితులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నిస్తానని చెప్పారు. ప్రజా సమస్యల కోసం వచ్చిన వ్యక్తిపై కొందరు దుందుడుకు స్వభావం ప్రదర్శిస్తున్నారని, అయితే తమకు పూర్తి సహనం ఉందన్నారు.

వ్యక్తి చెప్పుతో దాడి..
అంతకు ముందు పవన్‌ ఖమ్మం పట్టణంలోకి చేరుకోగానే.. గుర్తు తెలియని వ్యక్తి చెప్పుతో దాడి చేశాడు. ఓపెన్‌టాప్ వెహికల్‌లో అభిమానులకు అభివాదం చేసుకుంటూ ర్యాలీ నిర్వహిస్తున్న పవన్‌పై ఓ ఆగంతకుడు చెప్పు విసిరాడు. అయితే అదృష్టవశాత్తూ అది కారు బ్యానెట్‌పై పడడంతో అభిమానులు, కార్యకర్తలు ఊపిరి పీల్చుకున్నారు.అటు పవన్‌ సభ ముగింపు దశలో అభిమానుల తోపులాట చోటుచేసుకుంది. తమ అభిమాన నేతను చూసేందుకు అభిమానులు బారికేడ్లు దాటి ముందుకు దూసుకెళ్లడంతో తోపులాట జరిగింది. మొత్తానికి పవన్‌ పర్యటన అభిమానులు, జనసేన కార్యకర్తల్లో నూతన ఉత్తేజాన్ని నింపింది. మళ్లీ వరంగల్‌, ఖమ్మం, నల్లగొండ జిల్లాలకు వస్తానని పవన్‌ చెప్పడంతో కార్యకర్తల్లో ఉత్సాహం రెట్టింపయ్యింది. 

Don't Miss