శ్రీకాకుళం వెనుకబడిన జిల్లా కాదు... వెనక్కినెట్టబడ్డ ప్రాంతం : పవన్ కళ్యాణ్

18:03 - May 26, 2018

శ్రీకాకుళం : శ్రీకాకుళం జిల్లా వెనుకబడిన జిల్లా కాదు... వెనక్కి నెట్టబడ్డ ప్రాంతం, నిర్లక్ష్యం చేయపడ్డ ప్రాంతమని జనసేనాని పవన్ కళ్యాణ్ అన్నారు. పవన్ దీక్ష విరమించారు. పవన్ కళ్యాణ్ కు ఉద్దానం కిడ్నీ బాధిత కుటుంబం నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింప చేశారు. ఉద్దానం కిడ్నీ బాధితులు కోసం జిల్లా కేంద్రంలో పవన్ ఒకరోజు దీక్ష చేపట్టారు. దీక్ష విరమణ అనంతరం ఆయన మాట్లాడుతూ ఉద్దానం అంటే ఉద్యానవనం, రెండో కోనసీమ అన్నారు. వెనుకబాటు ప్రజలకే కానీ పాలకులకు కాదన్నారు. ఉద్దానంలో కిడ్నీ సంబంధిత వ్యాధితో 20 వేల మంది చనిపోయారని తెలిపారు. తాను నిరసన చేసేది.. రాజకీయ గుర్తింంపుకు కాదని చెప్పారు. తనకు రాజకీయ గుర్తింపు కావాలంటే టీడీపీకి ఎందుకు మద్దతు ఇస్తానని.. రాజకీయ గుర్తింపు తానే తీసుకుంటానని తెలిపారు. 'నేను రెండు రకాలుగా నిరసన తెలిపాని.. మనల్ని దగా చేసిన కేంద్ర ప్రభుత్వానికి, వారికి మద్దతు పలికిన టీడీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలిపానని చెప్పారు. ఉత్తరాంధ్రలో వలసలు ఎక్కువ, నిరుద్యోగులు ఉన్నారు. అభివృద్ధి ఫలాలు అందరికీ అందాలని పేర్కొన్నారు. శ్రీకాకుళం జిల్లాలోనే భారతమాత వెలిసిందని.. అందుకే ఇక్కడి నుంచి అధిక సంఖ్యలో సైన్యంలోకి వెళతారని అన్నారు. శ్రీకాకుళం గొప్ప నేల, ఉద్యమం పుట్టిన నేల అన్నారు. ప్రజల్లో చైతన్యం రావాలన్నారు. జనసేనకు అధికారం ముఖ్యం కాదని.... సహజంగా వస్తే కాదనం అని చెప్పారు. సామాజిక, రాజకీయ చైతన్య కోసం జనసేన పని చేస్తుందన్నారు. తాను సినిమాలు వదులుకొని రాజకీయాల్లోకి రావడం సరదాకు కాదని స్పష్టం చేశారు. ఉద్దానం కిడ్నీ బాధితులకు డబ్బులు దానం చేసిన వారు నిజమైన హీరోలు కొనియాడారు. రాజకీయ లబ్ధి కోసం ఉద్దానం రాలేదని స్పష్టం చేశారు. తమ పార్టీ దృష్టిలో ఉన్నవారు...లేనివారు అనే రెండే కులాలు అని అన్నారు. మండలానికొక డయాలసిస్ కేంద్రం కావాలని డిమాండ్ చేశారు. ఆరోగ్య సమస్యలు, బాధలు చెప్పుకునేందుకు రాష్ట్రంలో ఆరోగ్య శాఖ మంత్రి లేడని ఎద్దేవా చేశారు. సీఎం చంద్రబాబు చేస్తుంది.. తప్పు.. మీకు మద్దతు ఇచ్చి అధికారంలోకి తెచ్చిన నాపై విమర్శలు చేయడం తగదన్నారు.
తెలుగు ప్రజలంటే కేవలం తెలుగుదేశం ప్రజలే కాదని...రాష్ట్ర ప్రజలందరనీ అన్నారు. చంద్రబాబు ముందు కౌగిలించుకుని...వెనుక నుంచి బాకులతో పొడుస్తారని విమర్శించారు. చంద్రబాబు పైకి చిరునవ్వు నవ్వుతూ...వెనుక నుంచి వెన్నుపోటు పొడుస్తారని అన్నారు. ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా బలంగా పోరాటం చేస్తామన్నారు. జీవిత కాలమంతా శ్రమదోపిడీకి గురికావాల్సిందేనా....? అని ప్రశ్నించారు. తమకు ఏ రోగం వచ్చింతో తెలుసుకోలేని స్థితిలో ప్రజలు ఉన్నారని పేర్కొన్నారు. జనసేన నిరసన కవాతు నిరంతరంగా జరుగుతుందన్నారు.

 

Don't Miss