'ధర్మపోరాటం చేస్తారా ? ఉద్దానం వస్తారా' ?...

06:45 - May 27, 2018

శ్రీకాకుళం : పుష్కరాల కోసం 2 వేల కోట్లు ఖర్చు చేసిన ప్రభుత్వం.. ఉద్దాన బాధితులను ఆదుకునేందుకు ఎందుకు నిధులు కేటాయించడం లేదన్నారు పవన్‌కల్యాణ్‌. కిడ్నీ బాధితుల కోసం 24 గంటలపాటు దీక్ష చేసిన జనసేనాని.. సాయంత్రం దీక్ష విరమించారు. రాజకీయ లబ్ది కోసమే దీక్ష చేయాలనుకుంటే... 2014లో టీడీపీకి మద్దతిచ్చేవాడినే కాదన్నారు పవన్‌. 2019లో జనసేన అధికారంలో రాకపోయినా... ప్రజలకు ఎప్పుడూ అండగా ఉంటామని పవన్‌ హామీ ఇచ్చారు.

శ్రీకాకుళం జిల్లా ఉద్దానం వెనుకబడ్డ ప్రాంతం కాదని.. వెనక్కి నెట్టబడిన ప్రాంతమని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ అన్నారు. ఉద్దానం కిడ్నీ సమస్యలపై ప్రభుత్వం తక్షణమే స్పందించాలని డిమాండ్‌ చేస్తూ శుక్రవారం సాయంత్రం నుంచి దీక్ష చేపట్టిన జనసేనాని... శనివారం సాయంత్రం ఐదు గంటలకు దీక్ష విరమించారు. కిడ్నీ బాధిత కుటుంబానికి చెందిన చిన్నారి నిమ్మరసం ఇచ్చి పవన్‌తో దీక్ష విరమింపజేశారు.

తాను రాజకీయ లబ్ధి కోసం దీక్ష చేయలేదని పవన్‌కల్యాణ్‌ అన్నారు. తనకు రాజకీయ లబ్ధి కావాలనుకుంటే చంద్రబాబుకు మద్దతు ఇచ్చేవాడిని కాదన్నారు. పుష్కరాల కోసం రెండు వేల కోట్లు ఖర్చు చేసిన సర్కార్‌... 20 వేల మంది చనిపోయినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్ని రోజులైనా పాలకులు అభివృద్ధి చెందుతున్నారే గానీ... ప్రజల జిందగీలు మారడం లేదన్నారు. రాష్ట్రాన్ని మోసం చేసిన కేంద్రం, ఆ కేంద్రానికి మద్దతిచ్చిన తెలుగుదేశంపై నిరసనగానే తాను ఆందోళన చేసినట్లు పవన్‌కల్యాణ్‌ తెలిపారు.

సామాజిక రాజకీయ చైతన్యం కోసం జనసేన పార్టీ కృషి చేస్తుందని పవన్‌ అన్నారు. మనం ఏం చేసినా ప్రజలు పడి ఉంటారని పాలకులు అనుకోవద్దన్నారు పవన్‌. అన్యాయం పెరిగినప్పుడు తిరుగుబాటు తప్పదన్నారు. అభివృద్ధి రెండు కులాల గుప్పిట్లోనే ఉందని... అభివృద్ధి ఫలాలు అందరికీ అందాలన్నారు. కేంద్ర, రాష్ట్రాల కుమ్ములాటల్లో ప్రజలను ఇబ్బందిపాలు చేయొద్దన్నారు.

రెండు దశాబ్ధాలుగా 20 వేల మంది బాధితులు చనిపోయినా ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదన్నారు. శ్రీకాకుళం జిల్లాలో ఎంతోమంది పారిశ్రామికవేత్తలు, కార్పొరేట్‌ ఆస్పత్రులు ఉన్నా కనీసం ఉద్దానం బాధితులను పట్టించుకోవడం లేదన్నారు. కనీసం వారికి రెస్పాన్స్‌బులిటీ లేదా అని ప్రశ్నించారు. ప్రభుత్వం తలుచుకుంటే బాధితులను ఆదుకోవచ్చని... కానీ.. టీడీపీ ఆ దిశగా ఎందుకు ప్రయత్నించడం లేదన్నారు. అయితే.. ఉద్దానం బాధితులకు సాయం చేసేందుకు కొన్ని స్వచ్చంధ సంఘాలు ముందుకు వస్తున్నాయని... వారే నిజమైన హీరోలన్నారు పవన్‌.

బాధితుల సమస్యలు వినేందుకు రాష్ట్రంలో ఆరోగ్యశాఖ మంత్రి లేరన్నారు పవన్‌. బాధ్యతలన్నీ తన దగ్గరే ఉన్నాయని సీఎం అంటారు.. సీఎం దగ్గరకు ఎవరు వస్తారన్నారు. సీఎం ఓవైపు ధర్మపోరాటం చేస్తారా ? ఉద్దానం వస్తారా ? అని పవన్‌ ప్రశ్నించారు. ముందు కౌగిలించుకుని వెనక బాకులతో పొడిచే పద్దతి చంద్రబాబు మార్చుకోవాలన్నారు జనసేనాని. చంద్రబాబు ఇప్పటికైనా స్పందించి.. ఉద్దానం బాధితులను ఆదుకోవాలన్నారు. బాధితులందరికీ పెన్షన్‌ అందించాలన్నారు. జిల్లాలోని అన్ని మండలాల్లో డయాలసిస్‌ కేంద్రాలు ఏర్పాటు చేయాలని పవన్‌ డిమాండ్‌ చేశారు.

కిడ్నీ బాధితుల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోకపోతే ఈ అంశాన్ని ప్రజా క్షేత్రంలోకి తీసుకువెళ్తామన్నారు. జనం బాగే జనసేన లక్ష్యమని... వారిని కష్టాల నుంచి బయటపడేసేందుకు జనసేన అండగా ఉంటుందని పవన్‌కల్యాణ్‌ అన్నారు. 

Don't Miss