ప్రేమకథ సుఖాంతం

12:55 - November 14, 2017

కరీంనగర్‌ : జిల్లాలో ఓ ప్రేమకథ సుఖాంతమైంది. కులాంతర వివాహం చేసుకున్న కూతురిని తీసుకెళ్లిన తల్లిదండ్రులు ఆమెను మళ్లీ భర్తకు అప్పగించారు. అచ్చంగా సినిమాల్లో మాత్రమే కనిపించే ప్రేమ - పెళ్లి - తదనంతర కష్టాల లవ్‌స్టోరీ కరీంనగర్‌ జిల్లాలో ఆవిష్కృతమైంది. పోలీసుల సమక్షంలో ప్రేమకథ సుఖాంతమైనా.... ఈ సందర్భంగా కనిపించిన దృశ్యాలన్నీ అనుబంధాలు, ఆత్మీయతతో కలగలిపిన భావోద్వేగాలకు అద్దంపట్టాయి.  ఓవైపు ప్రేమించి పెళ్లిచేసుకున్న భర్త... మరోవైపు కనిపెంచిన తల్లిదండ్రులు... ఎవరిని వదులుకోలేక యువతి పడిన తపన, తండ్రి రోదన... అందరినీ కంటతడిపెట్టించాయి.
కొన్నాళ్లుగా ప్రేమించుకున్న హరిణి- ప్రవీణ్‌
ఈ ఇద్దరి పేర్లు హరిణి, ప్రవీణ్‌. ప్రవీణ్‌ది కరీంనగర్‌ జిల్లా జమ్మికుంట మండలంలోని సాయంపేట. ఇక హరిణిది మహబూబాబాద్‌ జిల్లా కేంద్రంలోనే నివాసం. వీరిద్దరు కొన్నాళ్లుగా ప్రేమించుకున్నారు.  వీరి కులాలు వేరు. దీన్ని సాకుగా చూపి వీరి తల్లిదండ్రులు వీరి పెళ్లికి అంగీకరించలేదు. దీంతో  గతనెల 7న సికింద్రాబాద్‌లోని ఓ ఆర్యసమాజ్‌లో పెళ్లి చేసుకున్నారు. 
జమ్మికుంటలో నూతన జంట ఫిర్యాదు
పెళ్లితోనే వీరి ప్రేమకథ ముగియలేదు. అక్కడే అసలు కథ మొదలైంది.  హరిణి... ప్రవీణ్‌ను పెళ్లి చేసుకోవడం ఆమె తల్లిదండ్రులు జీర్ణించుకోలేకపోయారు.  తీవ్ర మాసనిక వేదనకుగురైన హరిణి తల్లి మంచం పట్టింది.  దీంతో ఆమె తల్లిదండ్రులు హన్మకొండ పోలీస్‌స్టేషన్‌లో  ప్రవీణ్‌పై కంప్లైంట్‌ చేశారు. ఇదే సమయంలటో నూతన జంట ప్రవీణ్‌- హరిణి కూడా తమకు రక్షణ కల్పించాలంటూ జమ్మికుంట పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. 
కన్న ప్రేమను వదులుకోలేకపోయిన హరిణి
తల్లిదండ్రులను అయితే ఎదురించి ప్రవీణ్‌ను హరిణి పెళ్లి చేసుకుందికానీ... ఇన్నాళ్లు పెంచి పెద్దచేసిన తల్లిదండ్రుల ప్రేమను మాత్రం వదులుకోలేకపోయింది. తరచూ తన తల్లిదండ్రులతో ఫోన్‌లో మాట్లాడుతూ యోగక్షేమాలు కనుక్కునేంది. తల్లి పరిస్థితి బాగా లేదని తెలుసుకున్న హరిణి.... తన పుట్టింటికి వెళ్లొస్తానని ప్రవీణ్‌ను కోరింది. హరిణిని పంపిప్తే ఆమె తల్లిదండ్రులు తిరిగి పంపిస్తారో లేదోన్న  భయంతో అందుకు నిరాకరించాడు.  ఇంతలో హరిణి తరపు బంధువులు రెండువాహనాల్లో వచ్చి ప్రవీణ్‌ను కొట్టి హరిణిని బలవంతంగా కారులో ఎక్కించుకున్నారు. హరిణి ఉన్న కారు వెళ్లిపోగా ... మరో కారును గ్రామస్తులు అడ్డుకున్నారు. అందులో ఉన్న ఐదుగురిని జమ్మికుంట పోలీసులకుఅప్పగించారు. అమ్మాయిని తీసుకువస్తేనే వారిని వదిలిపెడతామని గ్రామస్తులు తేల్చి చెప్పారు.
ఇద్దరూ కావాలని కోరిన హరిణి
సోమవారం హరిణి, ఆమె తండ్రి జమ్మికుంట పోలీస్‌స్టేషన్‌కు తీసుకొచ్చాడు.  ఒకవైపు దెబ్బలుతిని నీరసంగా కనిపిస్తున్న భర్త, మరోవైపు కనిపెంచిన తల్లిదండ్రుల ప్రేమాప్యాతలు. ఈ రెండింటి మధ్య హరిణి నలిగిపోయింది. తనకు ఇద్దరూ కావాలంటూ ఆమె పడిన తపన అందరినీ కంటతడి పెట్టించింది. మరోవైపు తిరిగివచ్చిన భార్యను చూసి ప్రవీణ్‌ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు. అందరి ముందు ప్రేమగా అక్కున చేర్చుకున్నాడు. పోలీసులు యువతి తల్లిదండ్రులకు కౌన్సెలింగ్‌ ఇచ్చారు.  తాను తన భర్తతోనే ఉంటానని... తన తల్లిదండ్రులపై ఎలాంటి కేసులు పెట్టవద్దని హరిణి పోలీసులను ప్రాధేయపడింది.
తండ్రి కాళ్లపై పడి హరిణి కన్నీరుమున్నీరు 
హరిణి తన తండ్రి కాళ్లపై పడి కన్నీరుమున్నీరైంది. తండ్రికూడా బిడ్డను చూసి కండతడి పెట్టాడు.  తన పర్సులోంచి డబ్బులు తీసి కూతురుకు ఇచ్చాడు.  ఈ దృశ్యాలన్నీ మానవ సంబంధాలు, బంధుత్వాలు, అనుబంధాలు, అప్యాయతలు, మనుషుల మధ్య ఉండే ప్రేమానురాగాలకు అద్దంపట్టాయి. చివరికి హరిణి భర్తతో కలిసి మెట్టినింటికి వెళ్లిపోగా.. ఆమె కోరిక మేరకు పోలీసులు తల్లిదండ్రులను వదిలిపెట్టారు.

 

Don't Miss