హిందూ ధార్మిక మండలి ఏర్పాటు చేయాలంట...

06:40 - June 10, 2018

చిత్తూరు : ఆంధ్రప్రదేశ్‌లో వెంటనే హిందూ ధార్మిక మండలి ఏర్పాటు చేయాలని పీఠాధిపతులు డిమాండ్‌ చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం సాక్షిగా ఇటీవల జరిగిన పరిణామాల దృష్ట్యా పలువురు మఠాధిపతులు, పీఠాధిపతులు తిరుపతిలో సమావేశమయ్యారు. టీటీడీ వ్యవహారాలపై రాజకీయ నేతలు స్పందించడం మానేయాలని సూచించారు. తిరుమల దేవస్థానంలో కొన్ని రోజులుగా కొనసాగుతోన్న వివాదంపై మఠాధిపతులు, పీఠాధిపతులు స్పందించారు. ఈ మేరకు తిరుపతిలోని ఓ ప్రైవేటు కల్యాణ మండపంలో పీఠాధిపతులు సమావేశం నిర్వహించారు. హంపి పీఠాధిపతి విద్యారణ్య స్వామి, పరిపూర్ణానంద స్వామి, శివ స్వామి, కమలానంద భారతి తదితర పీఠాధితులు, మఠాధిపతులు ఈ సదస్సుకు హాజరై టీటీడీలో జరుగుతున్న పరిణామాలపై చర్చించారు.

టీటీడీలో ధార్మిక మండలి ఏర్పాటు చేయాలని స్వామీజీలు ముక్తకంఠంతో నినదించారు. ఈ మండలిలో మఠాధిపతులు, పీఠాధిపతులను నియమించాలని డిమాండ్‌ చేశారు. టీటీడీలో పారదర్శకత లోపించిందని, పాలక మండలి సభ్యులు అన్యమతస్తుల కార్యక్రమాలకు హాజరు కావడమేంటని ప్రశ్నించారు. రమణ దీక్షితులు వ్యవహారంపై స్వామీజిలు ఆచితూచి వ్యవహరించారు. రమణ దీక్షితులు ఆరోపణలు చేయడం తప్పేనని అభిప్రాయ పడ్డ నేతలు....ఆయనను లక్ష్యంగా చేసుకొని రాజకీయ నేతలు విమర్శలు, ఆరోపణలు చేయడం సరికాదన్నారు. అనువంశిక అర్చకులకు పదవీ విరమణ విధించడం సరికాదన్నారు. ఆలయ పవిత్రతను దెబ్బతీసే వారెవరినీ సమర్ధించబోమని స్పష్టం చేశారు.

సరైన పద్దతిలో దేవాలయాలు ఉండాలన్న ఉద్దేశంతోనే సమావేశం నిర్వహించినట్లు స్వామీజీలు చెప్పారు. ధార్మిక పరిషత్‌ ఏర్పాటు చేసి సభ్యుల సలహాలను టీటీడీ ఉన్నతాధికారులు స్వీకరించాలని కోరారు. శ్రీవారి ఆభరణాలపై సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరపాలని డిమాండ్‌ చేశారు. టీటీడీలో ఉన్న అన్యమతస్తులను ఇతర ప్రభుత్వ శాఖలకు బదిలీ చేయాలని కోరారు. టీటీడీ నిధులు ధార్మిక సంస్థలకే కేటాయించాలని, ప్రభుత్వ కార్యక్రమాలకు వినియోగించరాదని డిమాండ్‌ చేశారు. తమ నిర్ణయాలను నివేదిక రూపంలో ప్రభుత్వానికి అందజేస్తామని స్వామీజీలు తెలిపారు. ధార్మిక మండలి ఏర్పాటు అయితే చాలా సమస్యలు పరిష్కారం అవుతాయన్నారు. 

Don't Miss