అంతా ఆగమ్యగోచరం..

21:26 - November 20, 2016

హైదరాబాద్ : పాత నోట్లు చెల్లవు.. కొత్త నోట్లు అందుబాటులో లేవు. బ్యాంకులు బంద్. ఏటీఎంల నుంచి డబ్బులు తీసుకుందామంటే.. చాంతాడంత క్యూలైన్లు. పన్నెండు రోజులవుతున్నా.. ఇదే పరిస్థితి. ఇటు.. పెద్ద నోట్లను ఎవరూ తీసుకోకపోవడం..అటు... కొత్త నోట్లకు చిల్లర లభించకపోవడంతో... సామాన్యులు, పేదల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. తెలుగు రాష్ట్రాల్లో కొత్త నోట్ల కోసం జనం ఇంకా ఏటీఎంల ముందు భారీగా క్యూలు కడుతున్నారు. చాలా చోట్ల ఏటీఎంలు ఎప్పుడు తెరుచుకుంటాయా అని ప్రజలు ఎదురు చూపులు చూస్తున్నారు. ఏటీఎంలు మొరాయిస్తుండటం, లేదా అవుట్‌ ఆఫ్‌ సర్వీస్‌ అనే బోర్డులుండటంతో... వినియోగదారులు కొత్త నోట్ల కోసం కాళ్లరిగేలా తిరుగుతున్న పరిస్థితి ఉంది. పెద్ద నోట్ల రద్దై 12 రోజులు కావొస్తున్న పరిస్థితి ఇంకా చక్కబడలేదు. ఎక్కడ చూసినా ఏటీఎంల ముందు జనం బారులు తీరి కనిపిస్తున్నారు.

వ్యాపారుల నష్టం..
పెద్ద నోట్ల రద్దుతో వివిధ రకాల చిరు వ్యాపారులు తీవ్రంగా నష్టపోతున్నారు. కస్టమర్లు రాక... పూల మార్కెట్‌లతో పాటు పండ్లు, కూరగాయలు, నాన్ వెజ్ మార్కెట్లు బోసిపోయాయి. ప్రతి ఆదివారం మాంసం ప్రియులతో కిటకిటలాడే చికెన్‌ సెంటర్లు, మాంసం విక్రయ కేంద్రాలు వినియోగదారులు లేక విలవిల్లాడుతున్నాయి. పెద్దనోట్ల రద్దుతో గిరాకి లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని చిరు వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దేశంలో నోట్ల రద్దు వ్యవహారం పేదలు, కూలీలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోంది. కూలీకి వెళితే పాత నోట్లు ఇవ్వడం.. సరుకులు తెచ్చుకునే దుకాణాల్లో కొత్త నోట్లే తీసుకునే పరిస్థితి ఉండటంతో.. రోజూ వారి కూలీలు తీవ్ర దయనీయ స్థితిలో కాలం వెల్లదీస్తున్నారు. ఇంటి అద్దెలు కట్టడానికి కూడా డబ్బులు లేవని మహిళలు వాపోతున్నారు.

చిన్న నోట్లు ఎక్కడ ? 
చిన్న నోట్లు అందుబాటులో లేకపోవడంతో హోల్ సేల్, రిటైల్ పండ్ల మార్కెట్ కుదేలైపోయింది. కార్తీక మాసంలో వ్యాపారం మూడు పువ్వులు ఆరుకాయలుగా ఉండేది. కానీ ఇప్పుడా పరిస్థితి లేదు. వ్యాపారాలు లేక వ్యాపారులు లబోదిబోమంటున్నారు. లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి పండ్ల తోటలు కొనుగోలు చేస్తే...ఇపుడు చిల్లర దొరక్క.. వ్యాపారం లేక దిక్కుతోచని స్థితిలో పడ్డారు. కొనుగోలు చేసేందుకు వచ్చేవారు 2 వేల నోటు తీసుకురావడంతో చిల్లర లేక వ్యాపారాలను వదులుకుంటున్న పరిస్థితి నెలకొంది. గతంలో రోజుకు మూడు వేల వరకు వ్యాపారం అయ్యేదని.. ఇప్పుడు ఐదు వందల వ్యాపారం కూడా జరగడం లేదని చిరువ్యాపారులు ఆవేదన చెందుతున్నారు. తమ సమస్యలు చూసైనా... ప్రభుత్వం వేగంగా... ఐదు వందల రూపాయల కొత్త నోట్లతో పాటు.. వంద రూపాయల నోట్లను విరివిగా మార్కెట్లోకి విడుదల చేయాలని వినియోగదారులు కోరుతున్నారు. ఆర్బీఐ నుంచి నగదు సరఫరా పెరిగి... ఏటీఎంలు పూర్తిస్థాయిలో పనిచేస్తే కానీ.. సమస్యకు పరిష్కారం లభించే అవకాశం లేదు. ప్రజలు ఇంత ఇబ్బందులు పడుతున్నా.. ఆర్బీఐ, బ్యాంకులు... వేగంగా నోట్ల పంపిణీపై దృష్టిపెట్టినట్టు కనిపించడం లేదు.   

Don't Miss