పండగపూట నగదు కష్టాలు

12:41 - January 13, 2018

హైదరాబాద్ : పండగపూట ప్రజలకు నగదు కష్టాలు తప్పడంలేదు.. నోట్లరద్దు తర్వాత.. జనాలకు కొన్ని రోజుల తర్వాత పరిస్థితి సద్దుమణిగినట్లు అనిపించినా  పరిస్థితి మళ్ళీ మొదటికొచ్చింది. హైదరాబాద్‌ నగరంలోని ఏటీఎమ్‌లలో ఎక్కడ చూసినా నోక్యాష్‌ బోర్డులే దర్శనమిస్తున్నాయి. నగరంలో నగదు కష్టాలపై టెన్‌టీవీ ప్రత్యేక కథనం..
మళ్ళీ నోట్లపాట్లు 
ప్రజలకు మళ్ళీ నోట్లపాట్లు మొదలయ్యాయి... సంక్రాంతి సమయంలో హైదరాబాద్‌లో  ఏటీఎంలలో నోక్యాష్‌ బోర్డులు కనిపిస్తున్నాయి. దీంతో ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు.  బీఈ నిబంధనల ప్రకారం బ్యాంకుల్లో ఎలాగు నగదు పరిమితంగానే వస్తోంది. ఐతే ఏటీఎంలలో డబ్బు వస్తుందనుకుని వెళ్తున్న ప్రజలకు నిరాశే ఎదురవుతోంది. పండక్కు  ఊర్లకు వెళ్ళాలన్నా... షాపింగ్ చేయాలన్నా నగదు కావాలి. కానీ గత రెండు రోజులుగా ఏ ఏటీఎంకు వెళ్ళినా డబ్బులేదని నగర వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 
ఏటీఎంలలో నోక్యాష్‌ బోర్డులు
ఏటీఎం కార్డులు పట్టుకుని ఎన్ని చోట్లకు తిరిగినా... నోక్యాష్‌  బోర్డులే దర్శనమిస్తున్నాయని  ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ అకౌంట్లలో డబ్బున్నా కూడా పండగ పూట ఇబ్బందులు పడాల్సి వస్తోందని మండిపడుతున్నారు. మా డబ్బు మేము తీసుకోవడానికి కూడా బ్యాంకుల వారిని అడుక్కుంటున్నట్లు ఉందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నగదు సమస్య కేవలం హైదరాబాద్‌ నగరంలోనే కాదు.. తెలంగాణ రాష్ర్టవ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొంది. అన్ని జిల్లాల్లోనూ ఏ ఏటీఎం ముందు చూసినా నో క్యాష్‌ బోర్డులే కనిపిస్తున్నాయి. ఇప్పటికైన ప్రభుత్వం, బ్యాంకు అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు.

 

Don't Miss