ఈ కాలుష్య పరిశ్రమ అవసరమా ?

07:02 - July 9, 2018

సంగారెడ్డి : పారిశ్రామికంగా తమ ప్రాంతం అభివృద్ధి కావాలనే కోరుకుంటారు ప్రతి ఒక్కరూ.. దానివల్ల ఉపాధి అవకాశాలు కూడా మెరుగుపడతాయని ఆశిస్తారు. కానీ.. అవే పరిశ్రమలు తమకు ప్రాణాంతకంగా మారాయని ఆవేదన చెందుతున్నారంటే.. అంతకంటే విషాదం వేరే ఉండదు. సంగారెడ్డి జిల్లా మండల ప్రజలు ఇప్పుడు అలాంటి దుస్థితిలోనే జీవిస్తున్నారు.. ఇంతకీ వారు పరిశ్రమల వల్ల పడుతున్న బాధలేంటో ఓ సారి చూద్దాం.. మీరు చూస్తోంది కోహీర్‌ మండలం గద్వాల్‌లోని పిరామిల్‌ హెల్త్‌ కేర్‌ పరిశ్రమ. ఈ పరిశ్రమ వెదజల్లే కాలుష్యంతో చిలికేపల్లి, కవేలి, చింతల్‌ఘాట్, అనంతసార్, చిలమామిడి గ్రామాల ప్రజల జీవనం దుర్భరంగా మారింది. జల, వాయు కాలుష్యంతో జనజీవనం అతలాకుతలం అవుతోంది. భూగర్భ జలాలు పూర్తిగా కలుషితం అయ్యాయి. ఎక్కడ బోర్లేసినా.. తాగడానికి పనికి రాని నీరే వస్తోంది.. రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.

పరిశ్రమనుంచి వచ్చే వ్యర్థ జలాలను భూమిలోకి ఇంకిపోయేలా చేయడం వల్లే ప్రజలకు జీవనం అస్తవ్యస్తంగా మారింది. గత ఇరవై ఏళ్ళుగా కాలుష్య విధ్వంసంతో ప్రజలు తీవ్ర అనారోగ్యం పాలవుతున్నారు. ఇది చాలదన్నట్లు ఈ పరిశ్రమ విస్తరణకు పూనుకున్నట్లు తెలుస్తోంది. విస్తరణకు ప్రభుత్వం అనుమతిస్తే.. మా జీవితాలు మరింత దుర్భరంగా మారతాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇక్కడ కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరుకుంది. కలుషిత గాలితో ప్రజలు శ్వాస కోశ వ్యాధుల బారిన పడుతున్నారు. దీంతో ఊర్లు ఖాళీ చేయాల్సిన దుస్థితి నెలకొంది. ఇక తాగడానికి మంచినీరే కరువైంది. ఇలా ప్రాణాపాయ పరిస్థితుల్లో ఎలా జీవించాలంటూ ప్రశ్నిస్తున్నారు స్థానికులు. విపరీతంగా కాలుష్యం వ్యాపిస్తున్నా.. స్పందించని అధికారులపైనా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు..

పరిశ్రమల యాజమాన్యాల దృష్టి వార్షిక ఉత్పత్తి పెంచుకోవడం, లాభాలను గడించడంపైనే తప్ప అక్కడి ప్రజల జీవన స్థితిగతుల గురించి పట్టించుకోవడంలేదు. పైగా పరిశ్రమల విస్తరణకు పూనుకుంటున్నారు. ఇలాగైతే మా బతుకులేం కావాలని నిలదీస్తున్నారు. పరిశ్రమల ఏర్పాటుతో ప్రజల జీవన ప్రమాణాలు మెరుగు పడాలి కానీ... వారి జీవితాలే ప్రమాదంలో పడటం చాలా విషాదం. స్వలాభం మాత్రమే ఆశించే యాజమాన్యాలు, ఆగమేఘాలమీద అనుమతులిచ్చే అధికారులు, ప్రజా ప్రతినిధులు ప్రజల బాగోగులు పట్టించుకోకపోవడంపై ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Don't Miss