వణికిస్తున్న వదంతులు...

06:48 - May 25, 2018

హైదరాబాద్ : సోషల్‌ మీడియాలో వస్తున్న వదంతులతో అమాయకులపై దాడులు రోజు రోజుకీ పెరిగిపోతున్నాయి. నిజామాబాద్‌ జిల్లాలో దొంగగా భావించి ముగ్గురిని చితకబాదారు గ్రామస్థులు. అటు గుంటూరు జిల్లా రేపల్లె రైల్వేస్టేషన్‌లో గుర్తు తెలియని మహిళపై యువకుల దాడి చేశారు. పిల్లలను అపహరించే ముఠాగా భావించి దాడికి పాల్పడ్డారు. మరోవైపు చట్టాన్ని ఎవరూ చేతుల్లోకి తీసుకోవద్దని అమాయకులపై దాడులకు దిగితే చర్యలు తప్పవని ఇరు రాష్ట్రాల పోలీసులు హెచ్చరిస్తున్నారు.

సోషల్‌ మీడియాలో జరుగుతున్న అసత్య ప్రచారంతో ప్రజలు ఇంకా భయభ్రాంతులకు గురవుతూనే ఉన్నారు. పోలీసులు భరోసా ఇచ్చినా ఇంకా రాత్రిళ్లు జాగారం చేస్తూ.. అనుమానం వచ్చిన వ్యక్తులపై దాడులకు దిగుతున్నారు. అయితే ఈ దాడులల్లో అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు. నిజామాబాద్‌ జిల్లా బోధన్‌లోని తట్టి కోర్టు ఏరియాలో బాలరాజు అనే మూగ వ్యక్తిపై గ్రామస్థులు దాడి చేశారు. దొంగగా భావించి స్తంభానికి కట్టేసి చితకబాదారు. దీంతో బాలరాజు పరిస్థితి విషమంగా మారింది. ఎడపల్లి మండలం బాపు నగర్‌లోనూ ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. దొంగలుగా భావించి ఇద్దరు వ్యక్తులను కాలనీ వాసులు చితకబాదారు.

యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలం జియపల్లిలో బాలకృష్ణ అనే వ్యక్తిపై గ్రామస్థులు దాడి చేసి చంపారు. ఘట్కేసర్‌ మండలం కొర్రెములకు చెందిన బాలకృష్ణ జియపల్లిలోని బంధువుల ఇంటికి వెళుతుండగా దొంగ అనే నెపంతో అతనిపై దాడి చేశారు. దీంతో బాలకృష్ణ అక్కడికక్కడే మృతి చెందాడు. దాడికి పాల్పడిన ఎనిమిది మంది వ్యక్తులను పోలీసులు అరెస్ట్‌ చేశారు.

ఇలాంటి ఘటనలు అటు ఆంధ్రప్రదేశ్‌లోనూ కొనసాగుతున్నాయి. గుంటూరు జిల్లా రేపల్లె రైల్వేస్టేషన్‌లో గుర్తు తెలియని మహిళపై యువకుల దాడి చేశారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జీన్స్‌ ప్యాంట్‌ ధరించి ఉన్న మహిళను... పిల్లలను అపహరించే ముఠాగా భావించి యువకులు దాడికి దిగారు. మహిళకు తీవ్ర గాయాలు కావడంతో పోలీసులు తెనాలి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. పరిస్థితి విషమించటంతో వైద్యులు గుంటూరు ఆస్పత్రికి తరలించారు. అయితే బాధితురాలికి మతిస్థిమితం సరిగా లేనట్టు వైద్యులు వెల్లడించారు. మరోవైపు ఇలాంటి సంఘటనలు జరగడంపై ఏపీ సీఎం చంద్రబాబు ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు. ప్రజల్లో అవగాహన కల్పించి.. దాడుల జరగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ఘటనలపై పోలీస్‌శాఖ స్పందించింది. ఎలాంటి గ్యాంగ్‌లు రాష్ట్రంలోకి రాలేదని, అనవసరంగా అమాయకులపై దాడులకు పాల్పడితే తీవ్రమైన చర్యలు ఉంటాయని ఇరు రాష్ట్రాల పోలీసులు హెచ్చరించారు. అయితే అధికారులు, పోలీసులు ఎంత ప్రచారం కల్పించినా ప్రజల్లో మాత్రం భయం పోవట్లేదు. 

Don't Miss