కోట్లు గడించాలనుకున్నాడు..కటకటాల పాలయ్యాడు...

06:36 - December 7, 2017

రాజమండ్రి : ఫైనాన్స్‌ వ్యాపారంలో నష్టం రావడంతో ఏదోలా కోట్లు గడించాలనుకున్నాడా ఆ ప్రబుద్ధుడు... ఒక్కనెలలో కోటీశ్వరుడైపోవాలనుకున్నాడు. అనుకున్నదే ఆలస్యం అన్నట్లు సంక్రాంతి పండగను లక్ష్యంగా చేసుకుని.. అచ్చు అసలు నోట్లలా నకిలీ నోట్లను తయారుచేసేయడం మొదలెట్టాడు. అత్తమామింట్లోనే మకాం పెట్టేసి... చివరికి పోలీసులకు పట్టుబడి.. కటకటాలపాలయ్యాడు.. ఆ దొంగనోట్ల ముఠా నాయకుడు

ఇక్కడ కనిపిస్తున్న బండిల్స్‌ విలువ.. అక్షరాల 26లక్షలు... రెండువేలు, ఐదువందలు, వంద రూపాయలతో పాటు ఇంకా పూర్తిగా మార్కెట్లో అందుబాటులోకి రాని 200నోట్లు కూడా ఉన్నాయి. కానీ మీరు అనుకున్నట్టుగా ఇవి అసలు నోట్లు కాదు. అసలు నోట్లకు ఏ మాత్రం తీసిపోని నకిలీ నోట్లు. కేవలం ఒక కలర్‌ ప్రింటర్‌ సహాయంతో తయారుచేయబడిన ఫేక్‌ కరెన్సీ ఇదంతా.. తూర్పుగోదావరి జిల్లా బొమ్మూరు పోలీసు స్టేషన్ పరిధిలో మురళికొండ ప్రాంతానికి చెందిన తేటల శివారెడ్డి... ఉమా మహేశ్వరరావు సహాయంతో ఈ నోట్లను తయారుచేశాడు.

ఫైనాన్స్‌ వ్యాపారం చేసే శివారెడ్డికి.. ఆ వ్యాపారంలో నష్టం రావడంతో ఏకంగా దొంగనోట్లు ముద్రించి కోట్లు గడించాలనుకున్నాడు. తాను ముద్రించిన నోట్లను ఏదోలా సంక్రాంతి పండగకి చలామణి చేసేసి పెద్ద భవనాన్ని కట్టుకోవాలనుకున్నాడు. తూర్పుగోదావరి జిల్లాలో భారీ ఎత్తున జరిగే కోడిపందాల రూపంలో ఆ దొంగనోట్లను చలామణి చేయాలనుకుని ప్లాన్ వేసుకున్నాడు.

దొంగనోట్ల తయారీని టీవీలో చూసిన శివారెడ్డి తాను కూడా వాటిని తయారుచేయాలనుకున్నాడు. ఆలోచన వచ్చిందే తడువు కొత్తకలర్‌ ప్రింటర్‌‌, బండిల్స్‌ కొద్దీ బాండ్‌ పేపర్‌ ను కొనుగోలు చేశాడు. అంతే నోట్లపై సిల్వర్‌ స్క్రీన్‌ ను ఏర్పాటు చేసేందుకు గ్లిట్టర్‌ పెన్‌ లను కొన్నాడు. ఒక బాండ్‌ పేపర్‌కు మూడేసి నోట్ల చొప్పున కట్‌ చేసి.. ప్రింట్‌ చేయడం మొదలుపెట్టాడు. కోట్ల రూపాయల్లో ముద్రించడమే లక్ష్యంగా పెట్టుకున్నాడు. ముద్రించిన దొంగనోట్లను చలామణి చేసేందుకు, పార్టీలను తెచ్చేందుకు అనపర్తికి చెందిన ఉమామహేశ్వరరావు సహాయం తీసుకున్నాడు. అంతే కాదు బిలాస్ పూర్ వెళ్లిన ఉమామహేశ్వరరావు మూడు కేజీల బరువున్న వెండి బిస్కెట్ల ను తెచ్చి దానిపై బంగారు పూత పూసి గోల్డ్ బిస్కెట్లలా ఏజెన్సీ ఏరియాలో అమ్మేందుకు సిద్దమయ్యాడు. వీరి వ్యవహరం పోలీసులకు తెలియడంతో రంగంలోకి దిగి.. అరెస్ట్‌ చేశారు.

శివారెడ్డి ముఠా పై పోలీసులు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అందులోనూ అనపర్తికి చెందిన ఉమామహేశ్వరరావు , శివారెడ్డి తో కలిసి చేయడంపైనా పోలీసులు ఆరాతీస్తున్నారు. రాష్ట్రంలోనే దొంగనోట్ల తయారీకి అడ్డాగా ఉన్న అనపర్తి పాత ముఠా సహాయంతోనే శివారెడ్డి ఈనోట్ల తయారీ మొదలుపెట్టాడా అనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ పెద్ద ఎత్తున దొంగనోట్ల తయారీ బయటపడడంతో మరోసారి అనపర్తి దొంగనోట్ల అంశం తెరపైకి వచ్చింది. 

Don't Miss