ఆదివాసీలంటే లెక్కలేదా...?

19:59 - September 19, 2017

దేశంలో పులుల లెక్కల తెలుసు కానీ, ఆదివాసీల లెక్కలు తెలియవు..ఇదీ మన ప్రభుత్వాల చిత్తశుద్ధి.. అడవి పుట్టినప్పటి నుంచి గిరిజనుడిదే భూమి. అక్కడి సాగుభూమిపై, గూడేలపై ఆదివాసీలకే హక్కు. ఒక్కమాటలో చెప్పాలంటే అడవికి గిరిజనుడే రాజు. కానీ జరుగుతున్నదేమిటి? కారణాలు అనేకం చెప్తూ ఆదివాసులను అడవులనుండి తరిమే ప్రయత్నాలు చేస్తున్నాయి ప్రభుత్వాలు. ఈ దారుణాలకు తెలంగాణ వలస వచ్చిన గొత్తికోయలు బలవుతున్నారు. మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌ఘర్‌, జార్ఖండ్, తమిళనాడు, ఆంద్ర, తెలంగాణ ఇలా దేశంలో ఏ ఒక్క రాష్ట్రమూ దీనికి అతీతం కాదు.. అధికారంలో ఉన్న ఏ పార్టీలకి తేడాలేదు. అడవి బిడ్డలకు అన్యాయం చేయటంలో ఒకదానితో మరొకటి పోటీపడుతున్నాయి. ఇప్పుడు సొంత రాష్ట్రాన్ని వదిలి తెలంగాణ అడవులకు వలస వచ్చిన గొత్తికోయల పరిస్థితి అగమ్య గోచరంగా మారుతోంది. గత పదేళ్ల నుండి వలసలు ప్రారంభమయ్యాయి. ఇప్పుడు గోదావరి పరివాహక ప్రాంతంలోని అడవుల్లో పలు చోట్ల గుత్తికోయల ఆవాసాలు కనిపిస్తున్నాయి. చత్తీస్ ఘడ్ రాష్ట్రం దాడుల నుంచి తట్టుకోలేక గోదావరి దాటి జీవనోపాధి కోసం వలస వచ్చిన గుత్తికోయలకు ఇక్కడా అభద్రతే ఎదురవుతోంది. తలదాచుకోవాలని తెలంగాణకు వచ్చిన గుత్తికోయల పరిస్థితి రెంటికీ చెడిన రేవడిలా తయారైంది..

అడవుల్లో ఎంతకాలం ఉన్నా స్థానికులు కాలేని పరిస్థితి..ఓ పక్క పోడు వ్యవసాయం పట్ల ప్రభుత్వ విధానాన్ని ఆసరాగా చేసుకుని అటవీ సిబ్బంది సాగించే దుర్మార్గాలు.. మరోపక్క స్థానిక గిరిజనుల వ్యతిరేకత.. వెరసి గొత్తికోయలకు నిలువల నీడలేని పరిస్థితి ఏర్పడుతోంది.. స్వతంత్ర భారతంలో ఎవరైనా ఎక్కడైనా బతికే అవకాశం ఉంది. కానీ, ఆదివాసీల బడుగు బతుకులను ఆసరాగా తీసుకుని అధికార యంత్రాంగం దారుణంగా ప్రవర్తిస్తోంది.అసలీ అడవి ఎవరిది? ఆ అడవిని నిజంగా కాపాడుతున్నదెవరు? ఆ అటవీ సంపదను నాశనం చేస్తున్నదెవరు? కాకుల్ని కొట్టి గద్దలకు పెట్టే న్యాయాన్ని అనుసరిస్తున్నాయి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు. చారెడు నేల అడిగితే లాఠీ ఝుళిపిస్తున్నారు.. పోడు వద్దంటూ తరిమే ప్రయత్నాలు చేస్తున్నాయి. అటు అడవికి, ఇటు మైదానానికి కాకుండా ఆదివాసీల ఉనికినే ప్రమాదంలో పడేస్తున్నారు.. మరి ఆదివాసుల్ని తరిమేస్తే అడవి కళకళలాడుతుందా? కానీ వీరిలో 40 శాతం మంది నివాసాలని కోల్పోయి వివిధ ప్రాంతాలకు చెదిరిపోయారన్నది విషాదకరమైన వాస్తవం.. ముఖ్యంగా 1990ల నుంచి ప్రపంచీకరణలో భాగంగా ఆధిపత్య దేశాలన్నీ అభివృద్ధి చెందుతున్న దేశాలపై కన్ను వేశాయి. ఎక్కడ ఖనిజాలు కనిపిస్తే అక్కడ స్థానిక ప్రభుత్వాలను గుప్పిట్లో పెట్టుకుని కార్పొరేట్‌ శక్తుల ద్వారా తమ పంజా విసురుతున్నాయి. ఈ వేటలో ప్రధాన బలిపశువులు ఆదివాసీలే.

గత 30 ఏళ్లలో మొత్తం 35 లక్షల ఎకరాల అటవీ భూమి చట్టబద్ధంగా నాశనమైంది. దానిపై ఎలాంటి చర్యలు, పరిశీలనలు లేవు. కానీ, పొట్టకూటికోసం మాత్రం తనసొంతమైన అడవితల్లి ఇచ్చిన సంపదను ఉపయోగించుకుంటే, పండించుకుంటే, ప్రభుత్వాలకు నొప్పి కలుగుతోంది. ఈ దేశమూలవాసులను నిర్లక్ష్యం చేస్తూ ఇప్పటికీ వారికోసం ఎలాంటి నిర్మాణాత్మక చర్యలు చేపట్టకపోగా, ఉన్న కాస్త ఆధారాన్ని పోగొట్టే ప్రయత్నాలను ప్రజాస్వామికవాదులు తీవ్రంగా నిరసిస్తున్నారు. పూర్తి వివరాలకు వీడియో చూడండి.

Don't Miss