భరత్‌రెడ్డి అకృత్యాలపై సర్వత్రా నిరసన

09:46 - November 15, 2017

నిజామాబాద్‌ : జిల్లాలో భరత్‌రెడ్డి అరాచకాలపై దళిత సంఘాలు, వివిధ ప్రజాసంఘాలు మండిపడుతున్నాయి. దళితులపట్ల అమానుషంగా ప్రవర్తించిన భరత్‌రెడ్డిపై కఠిన చర్యలు తీసుకోవాలని  రాజకీయ పార్టీలు డిమాండ్‌ చేస్తున్నాయి. అయితే తన అరాచకాలు బయటపడగానే.... భరత్‌రెడ్డి పరారయ్యాడు. విషయం బయటచెప్పకుండా బాధితులను భరత్‌రెడ్డి మ్యానేజ్‌చేశాడన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
దళితులను చిత్రవధ చేసిన భరత్‌రెడ్డి 
నిజామాబాద్‌ జిల్లాలో భరత్‌రెడ్డి అనే బీజేపీనేత... దళితులను చిత్రహింసలకు గురిచేసిన ఘటన రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తోంది. అన్యాయాన్ని నిలదీసినందుకు దళితులను చిత్రవధ చేశాడు. మురికి నీటిలో ముంచి తన క్రూరత్వాన్ని చాటుకున్నాడు.  నోటికొచ్చిన మాటలు తిడుతూ.. దళితులపట్ల అమానుషంగా ప్రవర్తించాడు. బాధితులు మొత్తుకుంటున్నా వినకుండా కర్రచేతపట్టుకుని బెదిరింపులకు పాల్పడుతూ దొర తనం చూపించాడు. దళితులను మురికినీటి కుంటలో మునక వేయించాడు.
భరత్‌రెడ్డి అరాచకాలపై అధికారులు విచారణ 
భరత్‌రెడ్డి అరాచకాలపై ఎట్టకేలకు అధికారులు విచారణ చేపట్టారు. నవీపేట మండలం అభంగపట్నానికి చెందిన బాధితులు రాజేశ్వర్‌, లక్ష్మణ్ ఇంటికి సీపీ వెళ్లారు.  అయితే రాజేశ్వర్‌ ఇంటికి తాళం వేసి ఉంది. లక్ష్మణ్‌ ఇంటికి వెళితే.. అతని భార్య ఉంది. దీంతో సీపీ లక్ష్మణ్‌ భార్య భావనతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం నీటికుంటను సీపీ పరిశీలించారు.  భరత్‌రెడ్డిపై కేసు నమోదు చేశామని.... ఏసీపీ సుదర్శన్‌ విచారణ చేస్తున్నారని సీపీ తెలిపారు. 
భరత్‌రెడ్డి అమానుషత్వంపై ప్రజా సంఘాల మండిపాటు
దళితులపట్ల భరత్‌రెడ్డి అమానుషంగా వ్యవహరించిన తీరుపై దళిత, ప్రజా, విద్యార్థి, యువజన సంఘాలు మండిపడుతున్నాయి. నిజామాబాద్‌లో అఖిలపక్షం ఆధ్వర్యంలో వివిధ పార్టీల నేతలు , ప్రజాసంఘాల నాయకులు  ఆందోళనకు దిగారు. భరత్‌రెడ్డిపై అట్రాసిటీతోపాటు వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్‌ చేశారు. అనంతరం ఇంచార్జ్‌ కలెక్టర్‌ రవీందర్‌రెడ్డికి వినతిపత్రం అందజేశారు.
భరత్‌రెడ్డిని కఠినంగా శిక్షించాలి : ప్రజా సంఘాలు 
భరత్‌రెడ్డి గతంలోనూ పలువురిని చిత్రహింసలకు గురిచేసినట్టు ప్రజాసంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు.  నేరచరిత్ర కలిగిన భరత్‌రెడ్డిని కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు. బాధితులు ఇద్దరిని భరత్‌రెడ్డి తన వద్దే ఉంచుకున్నట్టు తెలుస్తోంది. వారికి డబ్బుల ఆశ చూపి కేసు పెట్టవద్దని సెటిల్‌ చేసుకున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి.  మరోవైపు దళిత, ప్రజాసంఘాల నేతలు ఈనెల 19న నవీపేట్‌ బంద్‌కు పిలుపునిచ్చారు.
  

 

Don't Miss