బాసలు చేసి,ఆశలు రేపి పొమ్మన్న పోలీస్..

07:51 - April 17, 2018

నల్లగొండ : ప్రేమిస్తున్నానన్నాడు. పెళ్లి చేసుకుంటానన్నాడు. బాసలు చేశాడు. ఆశలు రేకెత్తించి లోబర్చుకున్నాడు. తీరా పెళ్లిమాట ఎత్తేసరికి మొహం చాటేశాడు. అంతేకాదు... ఎంచక్కా మరో యువతితో పెళ్లికి సిద్ధమయ్యాడు. విషయం తెలుసుకున్న ఆ దివ్యాంగ ప్రేమికురాలు తనకు న్యాయం చేయాలంటూ ప్రియుడి ఇంటిముందు ధర్నాకు దిగింది. ఆమె ధర్నాకు గ్రామస్తులు, ప్రజాసంఘాల నేతలు మద్దతు తెలిపారు.

గర్భవతిని చేసి మొహం చాటేసిన మోసగాడు..
ఇదిగో ఈ ఫోటోలో కానిస్టేబుల్‌ వేశంలో ఫోజులు గొడుతున్న ఇతగాడి పేరు పగడాల రమేష్‌. నల్లగొండజిల్లా మేళ్ల దుప్పలపల్లి గ్రామం స్వగ్రామం. రమేష్‌ కొన్నాళ్లుగా అదే గ్రామానికి చెందిన దివ్యాంగురాలైన ప్రేమలతను ప్రేమిస్తున్నాడు. మొదటి నుంచి ఇద్దరూ క్లాస్‌మేట్స్‌. ప్రేమలతకు ప్రేమిస్తున్నానంటూ మాయమాటలు చెప్పాడు. నువ్వులేకుంటే బతకలేనంటూ నమ్మబలికాడు. నిజమేనని నమ్మిన ప్రేమలత అతడి ప్రేమను అంగీకరించింది. దివ్యాంగురాలు కావడంతో ప్రేమలతకు ఉద్యోగం వస్తుందని.. లైఫ్‌ సెటిల్‌ అయిపోతుందని రమేష్‌ భావించాడు. ప్రేమ పేరుతో ఆమెకు మాయమాటలు చెప్పి లోబర్చుకున్నాడు. పెళ్లిచేసుకుంటానంటూ నమ్మబలికాడు. ఆ క్రమంలోనే అతడికి పోలీస్‌ ఉద్యోగం వచ్చింది. దీంతో ఆమెను వదిలించుకోవాలని ప్లాన్‌ వేశాడు. పెళ్లెప్పుడని నిలదీస్తే మొహం చాటేశాడు. అంతేకాదు.. మరో యువతిలో పెళ్లికి సిద్ధపడ్డాడు.

ప్రియుడి ఇంటిముందు టెంట్ వేసి కూర్చున్న బాధితురాలు
రమేష్‌ మరో యువతిలో పెళ్లికి సిద్ధపడ్డాడని తెలుసుకున్న ప్రేమలత అతడి ఇంటిముందు టెంట్‌ వేసుకుని కూర్చుంది. తనకు న్యాయం చేయాలని కోరుతోంది. ఆమె దీక్షకు గ్రామస్తులు, ప్రజాసంఘాల నాయకులు అండగా నిలిచారు. రమేష్‌ కుటుంబంతో సంప్రదింపులు కూడా జరిపారు. అయినా వారు ససేమిరా అనడంతో ప్రేమలత ధర్నాకు దిగింది. తనను ప్రేమించి పెళ్లిచేసుకుంటానని నమ్మించిన మోసం చేసిన రమేష్‌తోనే వివాహం జరిపించాలని ఆమె కోరుతోంది.
బాధిరాలికి అండగా నిలిచిన గ్రామస్థులు, ప్రజా సంఘాలు
ప్రేమలతకు న్యాయం జరిగే వరకు తాము ఆమె ఆందోళనకు అండగా ఉంటామని ఐద్వా నాయకురాలు స్పష్టం చేశారు. పోలీసులు రమేష్‌పై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఈ విషయం ఎస్పీ దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేస్తామని ఎస్సై రాములు హామీనిచ్చారు. అప్పటి వరకు ఆందోళన విరమించాలని ప్రేమలతను కోరారు. ప్రేమలత మాత్రం తనకు న్యాయం చేసిన తర్వాతనే ఆందోళన విరమిస్తానని తేల్చి చెబుతోంది. 

Don't Miss