ఉత్తరం అందని ఊరు

12:05 - February 24, 2018

ఆసిఫాబాద్ : ఇంటర్‌నెట్‌ యుగంలోనూ లెటర్‌ అందని ఇంటిని ఒక్కటైనా చూశారా... కానీ శుభవార్త, దుర్వార్త, ఉద్యోగ నియామకం, ఇన్సూరెన్స్‌ డబ్బులు, భూముల దస్తావేజులు ఇలాంటి పత్రాలేవైనా సరే... పోస్ట్‌ ద్వారా అందుకోలేని చీకటి యుగంలో ఉన్నారు కొమురంభీం జిల్లా ఆసిఫాబాద్‌ మండలం చిర్రకుంట గ్రామస్థులు. గత మూడేళ్ళుగా తపాలా ద్వారా ఎలాంటి సమాచారం అందుకోలేని చీకటియుగంలో బతుకుతున్నారు వారంతా. గత మూడేళ్ళుగా తపాలా ద్వారా తమకెలాంటి ఉత్తరాలు రాలేదనే అనుకుంటున్నారు చిర్రగుంట గ్రామస్థులు. కానీ దీని వెనుక విస్తుబోయే వాస్తవం ఉన్నట్లు అనుమానాలు కలుగుతున్నాయి. అక్కడికి వచ్చే ఉత్తరాలు చెత్తకుప్పల్లో చేరుతున్నాయని కొందరు అంటున్నారు. మరికొందరు ఇంకో వాదన వినిపిస్తున్నారు.. తపాలా ద్వారా వచ్చిన ఉత్తరాలతో పాటు ఇతర సర్టిఫికెట్లను పోస్టల్‌ సిబ్బంది గోనె సంచిల్లో నింపి దాస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. వాటన్నింటినీ సిబ్బంది స్నేహితుల, బంధువుల ఇళ్ళలో భద్రపరుస్తున్నట్లు సమచారం.

యువత భవిష్యత్ గాల్లో దీపంలా
ఆ ఊరి యువత భవిష్యత్ గాల్లో దీపంలా మారింది.. ఓ యువకుడికి ఇండియన్‌ నేవీలో ఉద్యోగం వచ్చినా కాల్‌లెటర్‌ అందించని దుస్థితిలో అక్కడి పోస్టల్‌ వ్యవస్థ ఉంది. అమూల్యమైన, అపురూపమైన ఉత్తరాలు, దస్తావేజులు చేరాల్సిన చోటుకు చేరకుండా పోతున్నా అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు ఉన్నారు. దీనిపై సమగ్ర దర్యాప్తు చేసి తమకు న్యాయం చేయాలని గ్రామస్థులు వేడుకుంటున్నారు.ఇంతకీ ఉత్తరాల ముఖం చూసే అదృష్టం తమకు కలుగుతుందో లేదో అన్న బెంగతో ఉన్నారు ఆ ఊరి ప్రజలంతా... ప్రపంచమే కుగ్రామంగా మారిన డిజిటల్‌ యుగంలో... సరైన పోస్టల్‌ వ్యవస్థలేని గ్రామాలున్నాయంటే ప్రభుత్వాలకు, నాయకులకు సిగ్గుచేటు. చిర్రగుంట గ్రామానికి ఉత్తరాలు చేరవేయడంలో పోస్టల్‌శాఖ నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పటికైనా తపాలాశాఖ ఉన్నతాధికారులు దృష్టిసారించి ఆ గ్రామానికి వచ్చే ఉత్తరాలను ప్రజలకు చేరవేయాలని కోరుతున్నారు. 

Don't Miss