'పవర్ కట్' ఉండదా..మరి ఇదేంది ?

06:50 - May 13, 2018

విజయవాడ : ఎండలు మండుతుండడంతో ప్రజలకు కష్టాలు తప్పడం లేదు. మండుతున్న వేసవికి కరెంట్‌ కష్టాలు కూడా తోడవడంతో నరకయాతన అనుభవిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో విద్యుత్‌ కోతలు ప్రారంభమయ్యాయి. సమయం, సందర్భం లేకుండా పవర్‌ సప్లై నిలిచిపోవడంతో... వ్యవసాయరంగానికి ఆటుపోట్లు ఎదురవుతున్నాయి. ఏపీలో భానుడు తన ప్రతాపం చూపుతున్నాడు. ఉదయం 9 గంటలకే సూర్యుడు దంచికొడుతుండడంతో బయటకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. దీంతో ఇంట్లో కూలర్లు,ఏసీల కింద జనం సేద తీరుతున్నారు. ఇప్పుడు ప్రజలు కొత్త కష్టాలు మొదలయ్యాయి. కరెంట్‌ కోతలు పెరగడంతో బయటకు వెళ్లలేక.. ఇంట్లో ఉండలేక తల్లడిల్లిపోతున్నారు. వేసవి కారణంగా ఏపీలో విద్యుత్‌ డిమాండ్‌ భారీగా పెరిగింది. దీంతో ఒత్తిడి ఎక్కువవ్వడంతో పలుచోట్ల ట్రాన్స్‌ఫార్మర్లు పేలిపోతున్నాయి. చిన్నపాటి గాలి దుమారానికి చాలా ప్రాంతాల్లో విద్యుత్‌ వైర్లు తెగిపోతున్నాయి. దీంతో విద్యుత్‌ కోతలు ప్రారంభమయ్యాయి. ఏపీలోని 13 జిల్లాలోనూ ఇదే పరిస్థితి నెలకొంది.

నవ్యాంధ్ర రాజధాని విజయవాడలో విద్యుత్‌ కోతలు పెరిగాయి. దీంతో ప్రజలు ఇళ్లల్లో ఉండలేని పరిస్థితి నెలకొంది. విద్యుత్‌ వేళాపాళా లేకుండా పోతుండడంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. వేసవిలో కోతలుండవని ప్రభుత్వం చెప్తున్నా.... ప్రజలు కరెంట్‌ కష్టాలు తప్పడం లేవు. ఎప్పుడుపడితే అప్పుడు ఇష్టానుసారంగా... విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నారు. దీంతో ప్రజలతోపాటు వ్యాపారులు నష్టపోతున్నారు.విద్యుత్‌ కోతలతో ఇంట్లో పసిపిల్లలు, గర్భిణీ స్త్రీలు ఇబ్బందులు వర్ణనాతీతం.

మార్చి చివరి నాటికి 165 మిలియన్ యూనిట్ల కరెంట్ డిమాండ్ ఏర్పడింది. ప్రస్తుతం ఇది 185 మిలియన్ యూనిట్లకు చేరింది. ఏపీ వ్యాప్తంగా 15 లక్షల ఉచిత వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. వీటికి 7 గంటలపాటు విద్యుత్ అందిస్తే రోజుకు 9 మిలియన్ యూనిట్లు అవసరమవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. కానీ రోజుకు 3 మిలియన్ యూనిట్లు మాత్రమే ఇస్తున్నారు. ఉద్యాన, ఇతర పండ్ల తోటలకు వివిధ కేటగిరీల కింద సుమారు 1.50 లక్షల వరకు కనెక్షన్లు ఉన్నాయి. వ్యవసాయానికి అందించే చోట కూడా సరఫరాకు ఇబ్బందులు తలెత్తడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. వచ్చిపోయే కరెంట్‌తో ప్రజలకైతే ఇబ్బందులు తప్పడం లేదు. అధికారులు వేసవిని దృష్టిలో ఉంచుకుని విద్యుత్ సరఫరాకు అంతరాయం లేకుండా చూడాలని ప్రజలు కోరుతున్నారు.

Don't Miss