జెన్‌కో చైర్మన్‌ కు చేదు అనుభవం...

07:00 - May 9, 2018

భద్రాద్రి కొత్తగూడెం : జిల్లా మణుగూరులో జెన్‌కో చైర్మన్‌ ప్రభాకర్‌రావుకు చేదు అనుభవం ఎదురైంది. మణుగూరు థర్మల్‌ విద్యుత్‌ కేంద్రం భూ నిర్వాసితులు ప్రభాకర్‌రావును అడ్డుకున్నారు. పవర్‌ ప్లాంట్‌కు భూములిచ్చిన తమకు పరిహారం సరిగా చెల్లించలేదంటూ నిలదీశారు. ఇదే విషయంలో కోర్టుకెళ్లి స్టే తెచ్చుకున్న మరికొందరు రైతులు.. సమస్యను సామరస్యంగా పరిష్కరించుకొందామని సూచించారు. అయితే జెన్‌కో చైర్మన్‌ పట్టించుకోకుండా వెళ్లిపోవడంపై నిర్వాసితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో నిర్మాణంలో ఉన్న భద్రాద్రి థర్మల్‌ విద్యుత్‌ కేంద్రం పనులను జెన్‌కో చైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ ప్రభాకర్‌రావు పరిశీలించారు. ఈ సందర్భంగా పవర్‌ ప్లాంట్‌ నిర్వాసితులు పరిహారం చెల్లింపు విషయంలో జరిగిన అన్యాయాన్ని ఆయన దృష్టికి తెచ్చే ప్రయత్నం చేశారు. భూములు బలవంతంగా లాక్కొని తక్కువ పరిహారం చెల్లించడంతో కొందరు రైతుల కోర్టుకెక్కారు. ఇదే విషయాన్నిసామరస్య పూర్వకంగా పరిష్కరించుకొందామని రైతులు సూచించినా.. జెన్‌కో చైర్మన్‌ పట్టించుకోకుండా వెళ్లిపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

భద్రాద్రి విద్యుత్‌ ప్లాంట్‌ కోసం బలవంతంగా భూములు లాక్కోవడంతో భుక్తి కోల్పోయామని అన్నదాతలు ఆవేదన వెలిబుచ్చారు. సమస్యలు చెప్పుకొందామని వచ్చిన తమను జెన్‌కో చైర్మన్‌ ప్రభాకర్‌రావు పట్టించుకోలేదని నిర్వాసితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. జెన్‌కో చైర్మన్‌ ప్రభాకర్‌రావు తమను చలకనగా చూశారని భద్రాద్రి థర్మల్‌ విద్యుత్‌ కేంద్రం భూ నిర్వాసితులు బాధపడ్డారు. మరోవైపు భద్రాద్రి థర్మల్‌ విద్యుత్‌ కేంద్రం నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నాయంటూ జెన్‌ కో సీఎండీ ప్రభాకర్‌రావు అధికారుల పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. పనుల్లో వేగం పెంచాలని ఆదేశించారు. 

Don't Miss