ప్రైవేటు ఆసుపత్రిలో బాలింత మృతి...

09:31 - June 11, 2018

వరంగల్ : ప్రాణాలు నిలపాల్సిన వైద్యులు ప్రాణాలు తీస్తున్నారు. జిల్లాలో వైద్యుల నిర్లక్ష్యంతో ఓ బాలింత మృతి చెందిన విషాద ఘటన చోటు చేసుకుంది. వైద్యుల నిర్లక్ష్యంతోనే మృతి చెందిందంటూ మృతురాలి కుటుంబసభ్యులు ఆసుపత్రి ఎదుట ఆందోళన చేశారు. జనగామలోని బొమ్మెర గ్రామానికి చెందిన మానస అనే గర్భిణీ డెలివరీ నిమిత్తం క్యూర్ వెల్ ఆసుపత్రికి వచ్చింది. ఆదివారం ఆడశిశువుకు జన్మనిచ్చింది. కానీ డెలివరీ సమయంలో అధిక రక్తస్రావం కావడంతో ఆసుపత్రి వైద్యులు రెండు దఫాలుగా రక్తం ఎక్కించారు. రెండో యూనిట్ రక్తం గ్రూపు తారుమారు కావడంతో మానస అపస్మారక స్థితికి చేరుకుంది. విషయం బయటకు పొక్కకుండా హన్మకొండలోని మరో ఆసుపత్రికి తరలించారు. కానీ ఆరోగ్య పరిస్థితి విషమించడంతో మానస మృతి చెందింది. దీనిపై కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. తమకు న్యాయం చేయాలని వేడుకుంటున్నారు.

Don't Miss