పోలీసులు ఆ దొంగలను పట్టుకోగలరా..!

08:08 - July 17, 2017

విజయవాడ : జులై 11... రాత్రి 9గంటల సమయం.. బెజవాడలోని సీఎం క్యాంపు ఆఫీసు సమీపానికి కూతవేటు దూరంలోనే దోపిడీ దొంగలు చెలరేగిపోయారు. మారణాయుధాలతో ప్రజలను, నగల వ్యాపారులను హడలెత్తించి భారీ మొత్తంలో నగలు దోచుకుపోయారు. అయితే నగర పరిధిలో దోపిడీ దొంగల స్వైర విహారం వెనుక ఉన్న మూలాలు ఛేదించడం ఖాకీలకు సవాల్‌గా మారింది. ఈ భారీ దొంగతనం ఫ్రీ ప్లాన్డ్‌ స్కెచ్చేనని పోలీసులు తెలపడం..నిఘా వ్యవస్తలోని లోపాల్ని బయటపడేలా చేశాయి. సుమారు పది మందికి పైగా దొంగలు ఈ భారీ చోరికి పాల్పడ్డారు. ఈ దొంగతనం చేసేముందు వారు సిసి కెమెరాలకు చిక్కకుండా తగిన జాగ్రత్తలు తీసుకున్నారు. చోరీ చేసిన వెంటనే దొంగలు మాస్క్‌ లేకుండానే ఉడాయించిన విజువల్స్ కెమెరాల్లో రికార్డయ్యాయి. అయినప్పటికీ నిందితుల వివరాలు పూర్తిగా లభ్యం కాలేదు. దీన్ని బట్టి చూస్తే సిసి కెమెరాల పనితీరు ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.

సిసి ఫుటేజి కేసుల పరిష్కరం
సుమారు పది నెలల నుండి సిసి ఫుటేజి దృష్యాల ఆధారంగానే బెజవాడ పోలీసులు కేసులను పరిష్కరిస్తున్నారు. కేసుల పురోగతిలో సిసి కెమెరాలు చాలా ప్రయోజనకరంగా ఉన్నాయి. అలాగే ఎక్కడా సాక్ష్యాలు దొరక్క సవాల్‌గా మారిన కేసులను సిసి కెమెరా ఫుటేజ్‌ ఆధారంగానే పోలీసులు ఛేదించారు. కాని భారీ దోపిడి జరిగిన రోజు మాత్రం నగర పరిధిలోని ప్రధాన కూడలి వద్ద ఉన్న సిసి కెమెరాలు పని చేయకపోవడం పలు విమర్శలకు తావిస్తోంది. బంగారం తయారీ కేంద్రంలో ఉన్న 8 సిసి కెమెరాలు కూడా రెండు నెలలుగా పనిచేయడంలేదని పోలీస్‌కమీషనర్‌ తెలిపారు. అయితే ఆ ప్రాంతంలో రోడ్డుపక్కన ఉన్న సిసి కెమెరాలు ఏమాత్రం పనిచేసినా కేసులో పురోగతి చాలా సులభంగా లభించి ఉండేదని పలువురు చర్చిస్తున్నారు. టెక్నాలజీ పరంగా కేసును పరిష్కరించాలనుకున్న పోలీసులకు నిందుతులు దొరకడం సవాల్‌గా మారింది. నిందితుల కోసం ప్రత్యేక టీంలు రాష్ట్రాల్లో వేట ప్రారంభించాయి. ఇప్పటికే ఈ కేసు విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరా తీశారు. దీంతో డీజీపీ సాంబశివరావు రంగంలోకి దిగారు. త్వరితగతిన కేసును పరిష్కరించాలని ఆదేశాలు జారీ చేయడంతో పోలీసులు అన్నికోణాల్లో దర్యాప్తు ముమ్మరం చేశారు. ఎట్టి పరిస్థితిలోనూ దొంగలను పట్టుకుంటామని విజయవాడ సిపి గౌతం సవాంగ్‌ పేర్కొన్నారు. అయితే ఈ దొంగతనం జరిగిన తీరు చూస్తే ఘటనకు ముందే దొంగలు సిసి కెమెరాలను పసిగట్టారని, అవి పనిచేయడంలేదని తెలుసుకున్నాకే రాబరీకి పాల్పడి ఉండచ్చని పోలీసులు భావిస్తున్నారు.

ఇప్పటికే నగరంలో 1303 కెమెరాలు
ఇప్పటికే నగరంలో 1303 కెమెరాలను ప్రధాన ప్రాంతాల్లో ఏర్పాటు చేశారు. వీటికితోడు అదనంగా మరో 1200 కెమెరాలను ఏర్పాటు చేయాలని పోలీసులు నిర్ణయించారు. గతంలో ఏర్పాటు చేసిన సిసి కెమెరాల పనితీరును నిశితంగా పరిశీలిస్తున్నారు. ముఖ్యంగా వస్త్ర, బంగారు, షాపింగ్‌ మాల్స్‌, భవన సముదాయాల వద్ద సిసి కెమెరాలను ఏర్పాటు చేసి వాటి పనితీరుని నిరంతరం తనిఖీ చేయాల్సిన అవసరం ఉందని పోలీసులు భావిస్తున్నారు.మొత్తానికి బెజవాడలో జరిగిన భారీ దోపిడి పట్ల పోలీసులు అప్రమత్తం అయ్యారు. అనుమానం ఉండే వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచిస్తున్నారు. నగరంలో ఎవరైనా అనుమానాస్పదంగా కనిపించినా పోలీసులకు సమాచారం అందించాలని ప్రజలకు తెలిపారు.

Don't Miss