నోటి పుండ్లకు..పరిష్కారం..

16:11 - August 24, 2017

చాలా మందికి ఎప్పుడో ఒకసారి నోటిపుండ్లు అవుతుంటాయి. భోజనం..ఇతర పదార్థాలు తీసుకోవాలన్నా చాలా అవస్థలు పడుతుంటారు. కొద్దిగా కారం తగిలినా విలవిలలాడుతుంటారు. నాలుక..పెదాలు..నోటిపై భాగం..చిగుళ్లలో ఈ ఎర్రటి పుండ్లు వస్తుంటాయి. అనుకోకుండా కొరుక్కోవడం లేదా నోట్లో ఏర్పడ్డ గాయం వల్ల పుండ్లు ఏర్పడతాయి. విటమిన్‌ లోపం వల్ల కూడా పుండ్లు ఏర్పడతాయి. కొన్ని టిప్స్ పాటిస్తే ఈ సమస్య నుండి బయటపడొచ్చు.

గ్లాసు వేడి నీటిలో కొన్ని కొత్తిమీర ఆకులు వేయాలి. కొన్ని నిమిషాలు అలా ఉన్న తరువాత దానిని చల్లార్చాలి. రోజుకు మూడుసార్లు చొప్పున ఈ ద్రవాన్ని పుక్కిలించాలి. కొత్తిమీరలో మంటను తగ్గించే, యాంటిసెప్టిక్, యాంటీ ఫంగల్ గుణాలు ఉంటాయి.
అరకప్పు గోరువెచ్చని నీటిలో ఒక టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా కలపాలి. ఈ నీటిని పుక్కిలించాలి. రోజుకు రెండుసార్లు ఇలా చేయాలి. బేకింగ్ సోడాలో యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉంటాయి. 
ఒక గ్లాసులో చల్లటి నీళ్లను, ఇంకో గ్లాసులో వేడి నీళ్లను తీసుకోండి. ఒక సారి చల్లనీళ్లు, ఇంకోసారి వేడి నీళ్లు ఇలా మార్చి మార్చి పుక్కిలించండి.
ఉల్లిపాయ ముక్కను తీసుకుని పుండు ఉన్న ప్రాంతంలో అదిమి పెట్టి ఉంచాలి. ఉల్లిరసంతో రోజుకోసారి పుక్కిలించినా మంచి ఫలితం ఉంటుంది.
ఐదారు తులసి ఆకులను నమిలి, కొద్దిగా నీళ్లు తాగాలి. ఇలా రోజుకు ఐదారుసార్లు చేయాలి.
టమోటాలను పచ్చిగా తినడం వల్ల నోట్లో పుండ్లను నివారించొచ్చు. టమోట రసాన్ని రోజుకు 3 నుంచి 4 సార్లు పుక్కిలించి ఉమ్మేయాలి.

Don't Miss