సమస్యలకు నిలయంగా గురుకులాలు

18:14 - September 3, 2017

ఖమ్మం : తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకొని కోట్ల రూపాయలు వెచ్చించి నిర్వహిస్తోన్న గురుకులాలు సమస్యలకు నిలయంగా మారుతున్నాయి. ఖమ్మం జిల్లా ఇల్లందులోని 24 ఏరియాలో ఉన్న బాలుర మైనారిటీ గురుకుల పాఠశాలే ఇందుకు నిదర్శనం. అపరిశుభ్ర పరిసరాలు, శిథిలావస్థలో ఉన్న భవనాల్లోనే తరగతులు నిర్వహించడం విద్యార్థుల పాలిట శాపంగా మారింది. ఇదంతా ఒక ఎత్తైతే పాఠశాల బోధన, బోధనేతర సిబ్బంది నిర్వాకాలు విద్యార్థులకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్నాయి.

ప్రిన్సిపల్‌ బెదిరింపులు
తమకు ఎదురైన సమస్యల గురించి ప్రిన్సిపల్‌కు విన్నవించుకున్న విద్యార్థులకు విచిత్ర పరిస్థితి ఎదురైంది. నోటికొచ్చిన బూతులు తిట్టడం, కాళ్లతో తన్నడం, ఎక్కువ మాట్లాడితే టీసీ ఇస్తానని ప్రిన్సిపల్‌ బెదిరిస్తున్నాడని విద్యార్థులు వాపోతున్నారు. తమ తల్లిదండ్రులు కూడా తమని ఏనాడు దండించలేదని ప్రిన్సిపల్‌ నిర్వాకం మాత్రం చాలా బాధాకరంగా ఉందని విద్యార్థులంటున్నారు. విద్యార్థుల సమస్యలపై ప్రిన్సిపల్‌ ముదాఫిర్‌ హుస్సేన్‌ను 10 TV ప్రశ్నించగా అలాంటిదేమీ లేదని బుకాయించాడు. చదువుకోవాలని చెప్పినందుకే విద్యార్థులు తనపై ఆరోపణలు చేస్తున్నారన్నారు. విద్యార్థులకు ఆహారం కూడా సరైన రీతిలో అందిస్తున్నామని చెబుతున్నాడు.

తల్లిదండ్రులు మండిపటు
అయితే గతంలో కూడా ప్రిన్సిపల్‌పై పలు అవినీతి ఆరోపణలున్నాయి. పాఠశాలకు రావాల్సిన ఆహార పదార్థాలను పక్కదారి పట్టించి ప్రిన్సిపల్‌ జేబు నింపుకుంటున్నాడన్న ఆరోపణలున్నాయి. పాఠశాల సిబ్బందితో గొడవలు పడుతూ, సిబ్బందితో సమన్వయం లేక ఒకరిపై ఒకరు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసుకున్న సందర్భాలున్నాయి. పిల్లలను హింసించారనే ఆరోపణలు రావడంతో వ్యవహారం బయటికి పొక్కకుండా అధికారులు ప్రిన్సిపల్‌ను సెలవుపై పంపించారన్న అభియోగాలున్నాయి. సెలవుపై వచ్చిన తర్వాత కూడా ప్రిన్సిపల్‌ తీరుపై విద్యార్థుల తల్లిదండ్రులు మండిపడుతున్నారు. వేధించే ప్రిన్సిపల్‌ మాకొద్దని విద్యార్థులు, తల్లిదండ్రులు కోరుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి పాఠశాల సమస్యలు, సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు, స్థానికులు కోరుతున్నారు.

Don't Miss