ఫీజు కట్టకపోతే ఎండలో నిలబెడుతారా ?

18:47 - June 19, 2017

తూర్పుగోదావరి : ఫీజు కట్టలేదని విద్యార్థులను ఎండలో నిలబెడుతారా ? అని వారి తల్లిదండ్రులు ఓ ప్రైవేటు స్కూల్ యాజమాన్యాన్ని..అధికారులను నిలదీశారు. ఫీజులు చెల్లించలేకపోవడంతో విద్యార్థులను ఎండలో నిలబెట్టిన దారుణ ఘటన తూర్పుగోదావరి జిల్లాలో అమలాపురంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. అమలాపురంలో పరంజ్యోతి పబ్లిక్ స్కూల్ యాజమాన్యం కొంతమంది విద్యార్థులను ఎండలో నిలబెట్టింది. కేవలం ఫీజులు కట్టడం లేదనే కారణంతో యాజమాన్యం ఈ విధంగా వ్యవహరించింది. మూడు నుండి పదేళ్ల వయస్సున్న వారు ఎండలో నిలబడిన వారిలో ఉన్నారు. ఈ విషయం తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాల యాజమాన్యాన్ని నిలదీశారు. వెంటనే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. అమలాపురం తహశీల్దార్..ఎంఈవో విచారణ జరిపించారు. కొంత గడువుతో ఫీజులు చెల్లించాలని తల్లిదండ్రులకు అధికారులు సూచించడంతో తాత్కాలికంగా వివాదం సద్దుమణిగింది. ఇదిలా ఉంటే యాజమాన్య వైఖరిని తల్లిదండ్రులు తప్పుబడుతున్నారు. ఫీజులన్నీ ఆన్ లైన్ లో చెల్లించాలని యాజమాన్యం పేర్కొందని..కానీ తమకు సమాచారం..ఫీజుల ఎలా చెల్లించాలనే దానిపై అవగాహన లేదని తల్లిదండ్రులు పేర్కొంటున్నారు. మరి మంగళవారం ఏం జరుగుతుందో చూడాలి.

Don't Miss