కార్పొరేట్ స్కూల్ లో ఆరాచకం

21:34 - September 11, 2017

సంగారెడ్డి : విద్యార్థులకు విద్యాబుద్దులు నేర్పాల్సిన గురువులు చిన్నారుల పాలిట విలన్లుగా మారుతున్నారు. సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం- భారతినగర్‌లోని రావూస్‌ స్కూల్‌లో చిన్న తప్పుకు విద్యార్థినికి దారుణమైన పనిష్‌మెంట్ ఇచ్చారు. శనివారం యూనిఫాం వేసుకొని రాలేదంటూ పదకొండేళ్ల బాలికను అబ్బాయిల టాయ్‌లెట్‌ముందు నిలబెట్టారు.. గంటసేపు అక్కడే ఉన్న బాలిక... తీవ్ర మనో వేదనకు గురైంది. సాయంత్రం ఇంటికి వచ్చాక తాను ఇకనుంచి ఆ స్కూల్‌కు వెళ్లనంటూ తల్లిదండ్రులకు విషయం చెప్పింది.. దీంతో ఆగ్రహించిన తల్లిదండ్రులు సోమవారం స్కూల్‌ యాజమాన్యాన్ని ఈ విషయంపై ప్రశ్నించారు. యాజమాన్యం నిర్లక్ష్యంగా సమాధానం ఇవ్వడంతో స్కూల్‌ముందు ఆందోళనకు దిగారు.

మంత్రి కేటీఆర్‌ కూడా సీరియస్‌
ఈ విషయం తెలుసుకున్న విద్యార్థి సంఘాలు పాఠశాల ముందు ధర్నా చేపట్టాయి... పాఠశాలకు వచ్చిన బాలల హక్కుల సంఘం సభ్యులు... స్కూల్‌ నిర్వాకంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై మంత్రి కేటీఆర్‌ కూడా సీరియస్‌ అయ్యారు.. బాలికను అబ్బాయిల టాయిలెట్‌లో నిలబెట్టడం అమానవీయమని ట్వీట్‌ చేశారు. స్కూల్‌పై చర్యలు తీసుకోవాలని ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరిని ట్విట్టర్‌లో కోరారు. కేటీఆర్‌ ట్వీట్‌తో మంత్రి క‌డియం శ్రీహ‌రి స్పందించారు. రావూస్ పాఠ‌శాల ఘ‌ట‌న‌పై నివేదిక ఇవ్వాల‌ని డీఈవోను ఆదేశించారు.. మంత్రి ఆదేశాలతో డీఈవోలు సత్యనారాయణ రెడ్డి, విజయకుమారి స్కూల్‌కు వెళ్లారు. బాలికను టాయ్‌లెట్‌ముందు నిలబెట్టింది వాస్తవమేనని ధృవీకరించారు.. ఈ విషయంపై యాజమాన్యంతో చర్చించారు. ఈ ఘటనపై అధికారుల ఆగ్రహంతో ... స్కూల్‌ యాజమాన్యం దిగివచ్చింది... బాలికకు పనిష్‌మెంట్‌ ఇచ్చిన పీఈటీని సస్పెండ్‌ చేసింది... పనిష్‌మెంట్‌ విషయం, స్కూల్‌ యాజమాన్యం తీసుకున్న చర్యలను వివరిస్తూ అధికారులు ప్రభుత్వానికి నివేదిక సమర్పించనున్నారు.

 

Don't Miss