పట్నా పైరేట్స్‌ తొలి విజయం...

07:24 - October 12, 2018

హైదరాబాద్ : ప్రొ - కబడ్డీ సీజన్‌ 6లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ పట్నా పైరేట్స్‌కు తొలి విజయం లభించింది.  రాత్రి యూపీ యోధాతో తలపడిన పట్నా పైరేట్స్‌ 43-41 పాయింట్ల తేడాతో విజయం సాధించింది.  పట్నా రైడర్‌ పర్‌దీప్‌ నర్వాల్‌ అద్భుత ఆటతీరును కనబర్చాడు. తనొక్కడే 16 పాయింట్లు స్కోర్‌ చేశాడు.
పట్నా డిఫెన్స్‌ విభాగం అద్భుతంగా రాణించింది. ఆట మొదలైన రెండు నిమిషాలకే యూపీ 4-1 ఆధిక్యం ప్రదర్శించింది. మూడో నిమిషంలో పర్‌దీప్‌ తన తొలి పాయింట్‌ సాధించగా.. పట్నా 3-5కు ఆధిక్యాన్ని తగ్గించింది. ఈ దశలో రిషాంక్‌ దేవడిగ రెండు పాయింట్లు తేవడంతో యూపీ మరింత ముందంజ వేసింది.  రెండు రైడ్లతో నర్వాల్‌ మూడు పాయింట్లు రాబట్టడంతో ప్రత్యర్థి ఆధిక్యాన్ని పట్నా ఒక పాయింట్‌కు తగ్గించ గలిగింది.
14వ నిమిషంలో పట్నా పైరేట్స్‌ను యూపీ యోధ ఆలౌట్‌ చేసింది. అప్పుడు 20-15 స్కోరుతో యూపీ యోధ ముందంజలో ఉంది. అయితే ప్రథమార్థం చివరి ఐదు నిమిషాల్లో పట్నా ఆరు పాయింట్లు చేజిక్కించుకుని 21-20తో ముందంజ వేసింది. సెకండాఫ్‌లో ప్రత్యర్థిని ఆలౌట్‌ చేసిన పట్నా... 24-21తో ఆధిక్యాన్ని పెంచుకుంది. ఆట చివరి దశలో రెండు జట్లూ డిఫెన్స్‌, అటాకింగ్‌ గేమ్‌తో పాయింట్లు రాబట్టడంతో మ్యాచ్‌ నువ్వా - నేనా అన్నట్టు సాగింది. కానీ చివరకు పట్నానే విజయం వరించింది. 
మరో  మ్యాచ్‌లో తమిళ్‌ తలైవాస్‌...బెంగాల్‌ వారియర్స్‌ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లోనైనా గెలుస్తుందనుకున్న తమిళ్‌ తలైవాస్‌.. బెంగాల్‌ వారియర్స్‌  చేతిలోనూ చిత్తైంది. 36-27 స్కోరుతో ఓటమి చవిచూసింది. దీంతో తమిళ్‌ తలైవాస్‌ వరుసగా నాలుగో ఓటమిని మూటగట్టుకుంది. 

Don't Miss