ఎన్ని అరెస్టులు చేసిన ఉద్యమం ఆగదు : కోదండరాం

22:02 - August 11, 2017

కామారెడ్డి : జిల్లాలో టీ జేఏసీ అమరుల స్ఫూర్తియాత్రకు టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు, పోలీసులు అడుగడుగునా అడ్డంకులు సృష్టించారు. గులాబీ పార్టీ కార్యకర్తలు రాళ్లతో దాడిచేయగా... పోలీసులు జేఏసీ నేతల్ని పోలీస్‌ స్టేషన్‌లోనే నిర్భందించారు.పోరాడి సాధించుకున్న తెలంగాణలో ఆశించిన స్థాయిలో అభివృద్ధి జరగడం లేదంటూ జేఏసీ అమరవీరుల స్ఫూర్తియాత్ర చేపట్టింది. యాత్రను కామారెడ్డి జిల్లా బస్వాపూర్‌లో ప్రారంభించేందుకు జేఏసీ నేతలంతా అక్కడికి చేరుకున్నారు.. అక్కడినుంచి టీఆర్‌ఎస్‌ నేతలు, పోలీసుల హంగామా మొదలైంది.. జేఏసీ నేతల్ని గులాబీ పార్టీ కార్యకర్తలు అడ్డుకున్నారు.. బస్వాపూర్‌ గ్రామస్టేజీ నుంచి అరకిలోమీటర్ దూరంలోనే.. జాతీయ రహదారిపై కోదండరాం యాత్రను ఆపేశారు. అయితే ముందు అనుకున్న ప్రకారం అక్కడ కోదండరాం జెండాను ఎగురవేయాల్సిఉంది.. టీఆర్‌ఎస్‌ నేతల హడావుడితో జెండా ఎగురవేయకుండానే బిక్కనూరుకువచ్చారు.. అక్కడ పోలీసులు ఎంటరయ్యారు. ఎక్కువ వాహనాలకు అనుమతి లేదంటూ యాత్రను ఆపేశారు.. తమకు అనుమతి ఉందంటూ జేఏసీ నేతలు చెప్పినా వినకుండా జేఏసీ నేతల్ని పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు.. బయటకువెళ్లేందుకు ప్రయత్నించినా గేటువేసి నిర్భందించారు..

స్టేషన్‌లోనే ఆందోళన
పోలీసుల తీరుపై ఆగ్రహించిన టీజేఏసీ నేతలు... స్టేషన్‌లోనే ఆందోళనకు దిగారు.. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.. వీరిని పోలీసులు అడ్డుకొని పక్కకు తోసేశారు.. మహిళలతో పోలీసులు దురుసుగా ప్రవర్తించారు.జేఏసీ నిరసనను ఏమాత్రం పట్టించుకోని పోలీసులు మధ్యాహ్నం కోదండరాంను భోజనం చేయాలని సూచించారు.. తాను ఆహారం తీసుకోనన్న కోదండరాం.. అక్కడే నిరాహారదీక్ష చేపట్టారు.అటు కామారెడ్డిలో జేఏసీ తలపెట్టిన బహిరంగసభ దగ్గరా టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు రెచ్చిపోయారు.. సభదగ్గర టెంట్‌ను ధ్వంసం చేశారు.. సభకోసం ఏర్పాట్లు చేస్తున్న విద్యార్థి సంఘాలపై టమాటాలు, కోడిగుడ్లతో దాడి చేశారు.. ఈ ఘటనలో 30మంది విద్యార్థులకు గాయాలయ్యాయి.. ఇందులో పృథ్వీరాజ్‌ అనే విద్యార్థి పరిస్థితి విషమంగా ఉంది.. అతన్ని హైదరాబాద్‌కు తరలించారు.. మిగతావారికి ఏరియా ఆస్పత్రిలో చికిత్స అందించారు.

పలువురి మద్దతు
కోదండరాం అరెస్ట్‌కు నిరసనగా విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి.. బాన్సువాడ అంబేద్కర్‌ చౌరస్తాలో ఎస్ఎఫ్ఐ, ఏబీవీపీ, టీజీవీపీ, జీవీఎస్ విద్యార్థి సంఘాలు టీఆర్‌ఎస్‌ నేతల దిష్టిబొమ్మను దగ్ధం చేశాయి.. సిపిఐయంఎల్ న్యూడెమోక్రసి నేతలు కూడా సీఎం దిష్టిబొమ్మను దహనంచేసి నిరసన తెలిపారు.స్ఫూర్తియాత్రను అడ్డుకోవడంపై కోదండరాం సీరియస్‌గా స్పందించారు.. టీఆర్‌ఎస్‌ నేతలు గుండాల్లా ప్రవర్తించారని మండిపడ్డారు.. గతంలో ఉద్యమ సమయంలో ఇలాగే దాడులు చేశారని గుర్తుచేశారు.. ఇప్పుడు తెలంగాణ వచ్చాక ఇదే తరహాదాడులు చేయడం సిగ్గుచేటన్నారు.. టీఆర్‌ఎస్‌ ఎన్నిసార్లు దాడులుచేస్తే అంత బలం పెరుగుతుందని చెప్పారు.జేఏసీ నేతల్ని సాయంత్రం నాలుగు గంటలవరకూ నిర్భందించిన పోలీసులు.. ఆ తర్వాత వారందరినీ హైదరాబాద్‌కు తరలించారు.

Don't Miss