బాధగా ఉందన్న కోదండరాం...

09:20 - May 14, 2018

హైదరాబాద్ : తెలంగాణ జాయింట్‌ యాక్షన్‌ కమిటీకీ కోదండరామ్‌ వీడ్కోలు పలికారు. టీ జేఏసీని వీడుతున్న తరుణంలో చివరిసారిగా ఆయన అధ్యక్షతన విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కోదండరామ్ రాజీనామాను ఏకగ్రీవంగా ఆమోదించారు. టీ జాక్‌కు చైర్మన్‌గా కొనసాగే అద్భుత అవకాశం కోల్పోతున్నందుకు బాధగా ఉందన్నారు కోదండరామ్.

విద్యార్థులకు పాఠాలు చెప్పే తనను.. సమాజానికి నాయకుడిగా పరిచయం చేసిన తెలంగాణ యాక్షన్ కమిటీకి ప్రొఫెసర్ కోదండరామ్‌ వీడ్కోలు పలికారు. టీ జాక్‌కు శాశ్వతంగా దూరమవుతున్న సందర్భంలో చివరి సారిగా ఆయన అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో టీజాక్‌ ఛైర్మన్‌ పదవికి కోదండరామ్‌ చేసిన రాజీనామాను ఏకగ్రీవంగా ఆమోదించారు. రాష్ర్టంలోని పలు జిల్లాల నుంచి టీ జాక్‌ నాయకులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

తెలంగాణ జనసమితి పార్టీని స్థాపించిన కోదండరామ్‌ ప్రస్తుతం ఆ పార్టీకి అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు. టీజేఎస్‌ ఆవిర్భావ సభలోనే తెలంగాణ జాయింట్‌ యాక్షన్‌ కమిటీకి రాజీనామా చేశారు కోదండరామ్‌. ఈ నేపథ్యంలో హైదారాబాద్‌లోని కోదండరామ్ ఇంటి సమీపంలోని ఓ ప్రైవేట్ పంక్షన్ హల్‌లో టీజాక్‌ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. టీ జేఏసీ నుంచి టీ జేఎస్‌కు వెళ్తుతున్న వారి రాజీనామాలను ఈ సమావేశంలో ఆమోదించారు.

తెలంగాణ సాధనలో టీ జాక్‌ కీలక పాత్ర పోషించిందన్నారు కోదండరామ్‌. టీ జాక్‌ ఛైర్మన్‌గా పనిచేయడం అద్భుత అవకాశమన్నారు. ఇది తన జీవితంలో మరువలేని అంశమన్నారు. టీజాక్‌ లాంటి సంస్థలు దేశంలో ఎక్కడా లేవన్నారు కోదండరామ్. రాష్ర్టంలో పాలనాపరమైన మార్పు కోసమే తాము జనసమితి పార్టీని స్ధాపించామని చెప్పారు. తనకు ఓ ప్రత్యేక గుర్తింపు నిచ్చిన టీజాక్‌ను వీడుతున్నందుకు బాధగా ఉందన్నారు కోదండరామ్‌. టీజేఎస్‌ స్థాపన వల్లే టీ జాక్‌కు దూరం కావాల్సి వచ్చిందన్నారు కోదండరామ్. ఇంతవరకూ తనకు సహకరించిన వారికి కృతజ్ఞతలు తెలిపిన కోదండరామ్‌.. భవిష్యత్తులో టీ జాక్‌తో కలిసి పనిచేస్తామన్నారు.

Don't Miss