ఎమ్మెల్యే గణేష్ గుప్త ప్రోగ్రెస్ రిపోర్ట్

17:59 - September 6, 2017

నిజామాబాద్ : అర్బన్ నియోజకవర్గం 2009లో కొత్తగా ఏర్పడింది. 2 లక్షల 41వేల 562 మంది ఓటర్లున్నారు. బిసిలు, మైనార్టీలు అధికంగా వున్న నియోజకవర్గం. మున్నూరుకాపులు, మైనార్టీలు గెలుపు ఓటమిలను ప్రభావితం చేస్తుంటారు. టిఆర్ఎస్, బిజెపి, కాంగ్రెస్, ఎంఐఎం మధ్య చతుర్ముఖ పోటీ జరిగే నియోజకవర్గమిది. 2014 ఎన్నికల్లో చతుర్మఖ పోటీ జరగగా, టిఆర్ఎస్ అభ్యర్థి బిగాల గణేష్ గుప్తా విజయం సాధించారు. అంతకు ముందు 2009లోనూ, ఆ తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లోనూ బిజెపి అభ్యర్థి యెండల లక్ష్మీనారాయణ అప్పటి కాంగ్రెస్ నాయకుడు డి. శ్రీనివాస్ పై సంచలన విజయాలు నమోదు చేయడం విశేషం.

నగర మేయర్ కీ, ఎమ్మెల్యే అనుచరవర్గానికి మధ్య గ్యాప్
టిఆర్ఎస్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా వివాద రహితుడన్న పేరుంది. కానీ, ఆయన అనుచరవర్గం వ్యవహార శైలి ద్వితీయ శ్రేణి కేడర్ కి మింగుడుపడడం లేదు. పిఏ వ్యవహార శైలి, కాంట్రాక్టర్ల నుంచి కమీషన్ లు అడుగుతున్న తీరు ఎమ్మెల్యే గణేష్ గుప్తాకు చెడ్డపేరు తెస్తోంది. నగర మేయర్ కీ, ఎమ్మెల్యే అనుచరవర్గానికి మధ్య గ్యాప్ బాగా పెరిగిందన్న టాక్ వినిపిస్తోంది. ముఖ్యమంత్రి చేయిస్తున్న సర్వేలలో గతంలో టాప్ ప్లేస్ లో వున్న గణేష్ గుప్తా లేటెస్ట్ సర్వేలో 15శాతం మార్కులు కోల్పోవడం విశేషం. నిజామాబాద్ జిల్లాలోని ఇతర నియోజకవర్గాల కంటే అర్బన్ లోనే పార్టీ బలహీనంగా వుందన్నది సిఎం సర్వేల సారాంశం.నియోజకవర్గానికి జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చేలా అభివృద్ధి చేస్తానన్నది గణేష్ గుప్తా గత ఎన్నికల్లో ఇచ్చిన వాగ్ధానం. నగరాన్ని క్లీన్ అండ్ గ్రీన్ సిటీ మార్చడం, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ మరికొన్ని ముఖ్య వాగ్ధానాలు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నత్తనడకన సాగుతోంది. పనుల్లోనూ నాణ్యత లోపించిందన్న ఆరోపణలున్నాయి. గుంతలు తేలిన రోడ్లు నగర ప్రజలకు నిత్యం నరకం చూపిస్తున్నాయి. క్లీన్ అండ్ గ్రీన్ కనిపించడం లేదు.

మామూళ్లుగా పుచ్చుకుంటున్న అధికార పార్టీ నేతలు
నిజామాబాద్ టౌన్ లోని ప్రతి డివిజన్ లో ఒక పార్క్ ఏర్పాటు చేస్తామన్న వాగ్ధానమూ నెరవేరలేదు. రోడ్ల విస్తరణ పనులకు రాజకీయ ఒత్తిడిలు పెద్ద అడ్డంకిగా మారాయి. అధికార పార్టీ నాయకులు ప్రయివేట్ ఆస్పత్రుల నుంచి భారీగా మామూళ్లుగా పుచ్చుకుని, రోడ్ల విస్తరణకు మోకాలడ్డారన్న ఆరోపణలున్నాయి. నగర సుందరీకరణకు సంబంధించిన మాస్టర్ ప్లాన్ ఇంకా ప్రకటించలేదు. 1974 తర్వాత మాస్టర్ ప్లానే లేదు. రఘునాధ చెరవును మినీ ట్యాంక్ బండ్ గా మారుస్తామన్న వాగ్ధానమూ నెరవేరలేదు. శంకు:స్థాపనలు చేసి, ఆ తర్వాత పట్టించుకోవడం లేదన్నది పబ్లిక్ టాక్.అర్సపల్లి రైల్వే ఓవర్ బ్రిడ్జి కలగానే మిగిలిపోతోంది. ఓవర్ బ్రిడ్జి నిర్మాణం చేపట్టకపోవడంతో ఇతర రాష్ట్రాలకు వెళ్లే భారీ వాహనాలు అర్సపల్లి గేటు నుంచే నగరంలోకి ప్రవేశిస్తున్నాయి. దీంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. వాహన కాలుష్యమూ పెరుగుతోంది. ఇవన్నీ ఎమ్మెల్యే గణేష్ గుప్తాకు మైనస్ పాయింట్లుగా మారుతున్నాయి. మరోవైపు బిజెపి తన పట్టు నిలుపుకునేందుకు, పార్టీని విస్తరించేందుకు తీవ్రంగానే శ్రమిస్తోంది. నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గం నుంచి గణేష్ గుప్తా రెండోసారి గెలవాలంటే, రాబోయే రెండేళ్లు చాలా తీవ్రంగానే శ్రమించాల్సి వుంటుంది. 

Don't Miss