ఎమ్మెల్యే టి.రాజయ్య ప్రొగ్రెస్ రిపోర్ట్

19:10 - September 7, 2017

వరంగల్ : ఓడలు బండ్లు, బండ్లు ఓడలు కావడం అంటే ఏమిటో స్టేషన్ ఘన్ పూర్ రాజకీయాలను చూస్తే అర్ధమవుతోంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తొలినాళ్లలో ఇదే నియోజకవర్గం నుంచి ఎన్నికైన ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ఉప ముఖ్యమంత్రి హోదా పొందారు. ఆయన రాజకీయ ప్రత్యర్థి కడియం శ్రీహరి అప్పట్లో ఎంపిగా వున్నారు. కానీ, కొద్ది నెలల్లోనే కథ తిరగబడింది. రాజయ్య పదవి పోయింది. కడియం శ్రీహరిని ఉప ముఖ్యమంత్రి పదవి వరించింది. స్టేషన్ ఘన్ పూర్ లో తాటికొండ రాజయ్య పరిస్థితి ఏమిటి ? ఎమ్మెల్యేగా ఆయన గ్రాఫ్ ఎలా వుంది? ఇదే ఇవాళ్టి ఎమ్మెల్యే ప్రోగ్రెస్ రిపోర్ట్. 

స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గం గతంలో వరంగల్ జిల్లాలో వుండేది. ఇప్పుడిది జనగామ జిల్లాలో అంతర్భాగమైంది. ఇదే ఇప్పుడు స్థానిక ఎమ్మెల్యే, మాజీ ఉప ముఖ్యమంత్రి తాటికొండ రాజయ్యకు ప్రతికూలాంశంగా మారే  అవకాశం కనిపిస్తోంది. ఈ నియోజకవర్గంలోని జఫర్ గఢ్, స్టేషన్ ఘన్ పూర్; చిల్పూరు, మాల్కాపూర్ లను జనగామ జిల్లాలో కలపడం తో జనం కోపంగా వున్నారు. తమను వరంగల్ నుంచి వేరుచేయడం పై జఫర్ గడ్ మండల ప్రజలు రగిలిపోతున్నారు. ఎమ్మెల్యే రాజయ్యపై జఫర్ గడ్ పర్యటనలో దాడులు కూడా జరగడం పరిస్థితి తీవ్రతకు నిదర్శనం. 

స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గం 1957లో ఏర్పడింది. అప్పట్లో ఇది జనరల్ నియోజకవర్గం. 2009 నియోజకవర్గాల పునర్విభజనలో లింగాలఘనపురం రఘునాధపల్లి మండలాలు స్టేషన్ ఘన్ పూర్ లో చేరాయి. స్టేషన్ ఘన్ పూర్, ధర్మసాగర్, జాఫర్ గఢ్, లింగాల ఘనపురం, రఘునాధపల్లి మండలాలలోని 114 గ్రామాలు ఈ నియోజకవర్గంలో అంతర్భాగాలు. 

స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గంలో 2,22,556 మంది ఓటర్లుండగా, 1,11,444 మంది మహిళా ఓటర్లు. పురుష ఓటర్ల కంటే మహిళా ఓటర్ల సంఖ్య కాస్త ఎక్కువగా వున్న నియోజకవర్గమిది. 92819 కుటుంబాలున్న నియోజకవర్గమిది.

గతంలో కడియం శ్రీహరి, గుండె విజయరామారావు స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గం నుంచే ప్రాతినిథ్యం వహించారు. వీరిద్దరి చేతిలో రెండు సార్లు ఓడిపోయిన తాటికొండ రాజయ్య 2009, 2012, 2014 ఎన్నికల్లో వరుస విజయాలు సాధించడం విశేషం. ఈ మూడు ఎన్నికల్లోనూ ఆయన మెజార్టీ పెరుగుతూ వచ్చింది. 2009 ఎన్నికల్లో కడియం శ్రీహరిపై 11,210 ఓట్ల మెజార్టీతో నెగ్గిన రాజయ్య 2014నాటికి మెజార్టీని 58వేలకు పెంచుకున్నారు. 

స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గం సమస్యల నిలయం. సాగు తాగు నీటి కష్టాలు షరామామూలు. దళిత కాలనీలు అధికం. విద్య, వైద్య సదుపాయాలకు దళితవాడలు చాలా దూరం. రోడ్ల పరిస్థితి మరీ ఘోరం. నియోజకవర్గ కేంద్రంలోని రైల్వే ఓవర్ బ్రిడ్జి పూర్తి చేయడానికే పదేళ్లు పట్టింది. 
లెదర్ పార్క్ అతీగతీ లేకుండా పోయింది. ధర్మసాగర్ మండలం ముప్పారం దేవునూరు గ్రామాలలో అతిపెద్ద టెక్స్ టైల్ పార్క్ నిర్మిస్తామన్న వాగ్థానం అడ్రస్ లేకుండా పోయింది . ఎమ్మెల్యే రాజయ్య నిర్లక్ష్యం వల్లనే టెక్స్ టైల్ పార్కు రావడం లేదన్న ప్రచారం జరుగుతోంది. నియోజకవర్గ కేంద్రంలో డిగ్రీ కాలేజీ ఏర్పాటు చేయించడంలోనూ, అన్ని గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించడంలోనూ విఫలమయ్యారన్న విమర్శలున్నాయి. 

తాటికొండ రాజయ్యను అవినీతి ఆరోపణలు చుట్టుముట్టాయి. ఇటీవల నిర్వహించిన సర్వేలో ఆయన రేటింగ్ పడిపోయింది. ప్రభుత్వ సబ్సిడీ ట్రాక్టర్లు, సిడిఎఫ్ పనులు, అంగన్ వాడీ ఉద్యోగాలు, విద్యా వాలంటీర్ల నియామకాలు, మిషన్ కాకతీయ పనులు ఇలా అనేక వ్యవహారాల్లో నేరుగా సిఎం కార్యాలయానికి ఫిర్యాదులు వెళ్లడం ఆయనకు మైనస్ పాయింట్ గా పరిణమిస్తోంది. వరంగల్ వుండికూడా ప్రభుత్వ కార్యక్రమాలకు డుమ్మా కొడుతున్నారన్న టాక్ వినిపిస్తోంది. అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేయించడంలో విఫలమవుతున్నారన్న విమర్శలున్నాయి.  మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ తో పాటు దేవాదాల సొరంగం పనులు కూడా నత్తనడకనే సాగుతుండడంతో ఎమ్మెల్యే పనితీరుపై జనంలో అసంతృప్తి పెరుగుతోంది.

తన మీద ఎన్ని ఆరోపణలు, విమర్శలు వస్తున్నా ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య చాలా కూల్ గా కనిపిస్తున్నారు. రానున్న రెండేళ్లలో అభివృద్ధి చేసి చూపిస్తానంటున్నారాయన. సిఎం కెసిఆర్ ఏదో ఒక రోజు పిలిచి, తనకు పదవి ఇస్తారన్న ఆశాభావంతో వున్నారు. మూడేళ్ల సమయం కరిగిపోయింది. ప్రజలను మెప్పించడానికి ఇక రెండేళ్లే సమయముంది

Don't Miss