నగరంలో ఎటు చూసినా దుమ్ము..ధూళి...

17:48 - January 27, 2018

నిజామాబాద్ : జిల్లా మున్సిపల్ కార్పొరేషన్ కు కోట్లాది రూపాయల నిధులు వస్తున్నా.. వివిద శాఖల మధ్య సమన్వయం లేకపోవడంతో పనులు నత్తనడకన కొనసాగుతున్నాయి. నెలల తరబడి ఈ పనులు కొనసాగుతుడంటంతో నిత్యం వాహనదారలు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పనులు కొన్ని ప్రాంతాల్లొ పూర్తి అయినప్పటికి అక్కడ రోడ్లు వేయకపోవడంతో.. దుమ్ము, ధూళీతో జనం సతమతమవుతున్నారు. నిజామాబాద్‌ నగరంలో జరుగుతున్న అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ పనుల కోసం ప్రభుత్వం 145 కోట్ల రూపాయలు వెచ్చిస్తోంది. ఈ పనులు వచ్చే జూన్‌ నెల వరకు పూర్తి చేయాలని నిర్ణయం తీసుకున్నారు. కాంట్రాక్టర్లు ప్రజాప్రతినిధుల జేబులు నింపుతూ.. ఇష్టారీతిన రోడ్లను తొవ్వేస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు.

మొదటగా అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ పైపులు వేసి.. ఆ వెంటనే మిషన్‌ భగీరథ పనులు మొదలు పెట్టారు. ప్రధాన మార్గాల గుండా ఈ పైపు లైన్లు వేయటంతో వాహనదారులకు ఇబ్బందులు తప్పటం లేదు. పనులు పూర్తి అయిన ప్రాంతాలలొ రోడ్లు వేయకుండా.. మరమ్మత్తులు చేపట్టకపొవటంతొ వాహనదారులు అవస్థలు పడుతున్నారు. దీంతో బీజేపీ-టీ మాస్‌ ఫోరం నేతలు పనులు త్వరగా పూర్తి చేయాలంటూ.. మున్సిపల్‌, కలెక్టరేట్‌ కార్యాలయ ఎదుట ఆందోళనలు చేపట్టారు.

ఆందోళనలు చేపట్టినా సంబంధిత శాఖాధికారులు మాత్రం పట్టించుకోవడం లేదనే విమర్శలొస్తున్నాయి. నగరంలో పనులు జరిగే సమయంలో సంబంధిత అధికారులు నిర్ణీత సమయాన్ని నిర్ణయించి పనులను పూర్తిచేయించాలి. కానీ అధికారుల నిర్లక్ష్యంతో పనులు జరగడంలేదంటూ పలువురు ఆరోపిస్తున్నారు. సంబంధిత శాఖల అధికారులు సమావేశమై.. పనులు జరిగే ప్రాంతాల్లో ట్రాఫిక్‌ మళ్లించేందుకు చర్యలు తీసుకోవాలి. కానీ కాంట్రాక్టర్లు ఎలాంటి సూచనలు లేకుండానే పనులు మొదలు పెట్టారు. పగటి సమయంలో పనులు చేస్తుండటంతో దుమ్ము, ధూళి ఎగసిపడుతుందని.. దీంతో ప్రజలు శ్వాసకోశ సంబంధిత రోగాల బారిన పడుతున్నారని పలువురు నేతలు ఆరోపిస్తున్నారు.

కేంద్ర ప్రభుత్వం 75కోట్లు మంజూరు చేసినా.. పాలక మండలి, మున్సిపల్‌ అధికారులు పనుల్ని ఎందుకు త్వరగా చేయడంలేదో అర్ధం కావడం లేదని.. నిజామాబాద్‌ మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మినారాయణ మండిపడ్డారు. అధికారులు ఇప్పటికైనా త్వరగా పనులు పూర్తి చేసి ప్రజల ఇబ్బందులు తొలగించాలని డిమాండ్‌ చేశారు. నగరంలో ఎటు చూసినా దుమ్ము, ధూళి ఎగిసిపడుతుండటంతో.. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికైనా సంబంధిత శాఖాధికారులు స్పందించి.. పనులు వేగంగా జరిగేలా చూడాలని ప్రజలుకోరుకుంటున్నారు.

Don't Miss