వివాదాస్పదంగా పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం

06:54 - January 9, 2017

తూ.గో : సీతానగరం వద్ద సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేసిన పురుషోత్తపట్నం లిఫ్ట్‌ ప్రాజెక్ట్ వివాదాస్పదంగా మారుతోంది. ఓవైపు పోలవరానికి కాంక్రీటు పండుగలు చేసి..మరోవైపు లిఫ్ట్‌ స్కీమ్‌లు దండగగా నిర్మిస్తున్నారంటూ విపక్షాలు మండిపడుతున్నాయి. ఈ లిఫ్ట్‌ పథకంతో చంద్రబాబు అవినీతికి ఆజ్యం పోస్తున్నారని వైసీపీ విమర్శిస్తుంటే...పురుషోత్తపట్నం వల్ల ప్రయోజనం లేదని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ మండిపడుతున్నారు.

విమర్శలను పట్టించుకోని సర్కార్...

అయితే ఈ విమర్శలను ప్రభుత్వం మాత్రం పట్టించుకోవడం లేదు. ఈ ఎత్తిపోతల ద్వారా జగ్గంపేట, పెద్దాపురం, పిఠాపురం, ప్రత్తిపాడు, తుని నియోజకవర్గాల పరిధిలోని భూములకు సాగునీరు అందనుందని చంద్రబాబు స్పష్టం చేశారు. గత ప్రభుత్వం తవ్వి వదిలేసిన కాలువల్లో రైతుల కన్నీరు పారుతోందని అన్నారు. ఉత్తరాంధ్ర, రాయలసీమల్లో ప్రాజెక్టుల పూర్తికి ప్రాధాన్యత ఇస్తామని చంద్రబాబు తెలిపారు.

లిఫ్ట్‌ నిర్మాణం కోసం భూసేకరణ ప్రయత్నాలు....

మరోవైపు పురుషోత్తపట్నం లిఫ్ట్‌ నిర్మాణం కోసం భూసేకరణ ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. దీంతో తమకు పట్టిసీమ తరహా ప్యాకేజీ చెల్లిస్తేనే భూములిస్తామని నిర్వాసితులు చెబుతున్నారు. ఇప్పటికే మూడుసార్లు సర్వేబృందాలను అడ్డుకున్న నిర్వాసితులు...2013 భూసేకరణ చట్టం ప్రకారమే పరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేస్తున్నారు.

Don't Miss