ఉర్జిత్ పటేల్ రాజీనామా ?

15:51 - October 31, 2018

ఢిల్లీ : కేంద్రం..ఆర్బీఐ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటున్నాయి. విబేధాలు పొడచూపడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిప్యూటీ గవర్నర్ విరాల్ ఆచార్య వ్యాఖ్యలు... వాటికి కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ కౌంటర్లతో ఆర్‌బీఐకి, కేంద్ర ప్రభుత్వానికి మధ్య విభేదాలు ముదిరాయి. తాజాగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ ఉర్జిత్ పటేల్ తన పదవికి రాజీనామా చేయనున్నారా? పుకార్లు షికారు చేస్తున్నాయి. పటేల్ రాజీనామా చేసే అవకాశాలు ఉన్నాయని జాతీయ మీడియాలో ప్రచారం జరుగుతోంది. 
ప్రభుత్వరంగ బ్యాంకుల్లో మొండి బకాయిలున్న సంగతి తెలిసిందే. ఇలాంటి బ్యాంకులపై ఆర్‌బీఐ కఠిన ఆంక్షలు విధించింది. ఆ ఆంక్షల్ని సడలించాలంటూ కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకొస్తోందన్న ప్రచారం జరుగుతోంది. స్వయం ప్రతిపత్తిని కాపాడకపోతే ముప్పు తప్పదంటూ ఆర్‌బీఐ గవర్నర్ ఆచార్య ఇటీవలే కామెంట్ చేశారు.  దీనికి ప్రతిగా ఆర్థిక మంత్ర జైట్లీ కౌంటర్ ఇచ్చారు. 2008 నుంచి 2014 మధ్య అన్ని బ్యాంకులు విచ్చలవిడిగా లోన్లు ఇస్తుంటే ఆర్‌బీఐ కట్టడి చేయలేదంటూ జైట్లీ మండిపడ్డారు. 
ఆర్బీఐ చట్టంలోని సెక్షన్ 7 ప్రకారం ఉర్జిత్ పటేల్‌కు కేంద్రం లేఖలు పంపినట్లు సమాచారం. రిజర్వ్ బ్యాంకుతో సంప్రదింపులు జరుపుతూ ఆర్బీఐ గవర్నర్‌కు సూచనలు చేసే అధికారం కేంద్రానికి ఉందని సెక్షన్ 7 స్పష్టం చేస్తోందని లేఖలో పేర్కొనట్లు తెలుస్తోంది. కేంద్రం సెక్షన్ 7ను ఉపయోగించడంతో ఆర్బీఐ సతంత్ర ప్రతిపత్తిపై అనుమానాలు తలెత్తున్నాయి. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఇలాంటి సెక్షన్ బయటకు తీయడంతో ఆర్బీఐ గవర్నర్ రాజీనామా చేస్తారనే సంకేతాలు వెలువడుతున్నాయి. కానీ మంగళవారం నిర్వహించిన ఓ సమావేశంలో పటేల్ కూడా పాల్గొన్నారని, పదవికి రాజీనామా చేసే సూచనలు కనిపించడం లేదని మరో వాదన వినిపిస్తోంది. 

Don't Miss