ఆర్బీఐపై కేంద్రం జోక్యం వుండకూడదు : రఘురామ్ రాజన్

13:16 - November 6, 2018

ఢిల్లీ : ఆర్బీఐ మాజీ గవర్నర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆర్బీఐ నిర్వహణలో ప్రభుత్వ జోక్యం ఉండరాదని మాజీ గవర్నర్ రఘురాం రాజన్ వ్యాఖ్యానించారు. ఇతర ప్రయోజనాల కోసం ఆర్బీఐని వాడుకోవడం మంచిది కాదని పరోక్షంగా కేంద్రప్రభుత్వానికి చురకలంటించారు. కాగా ప్రస్తుత ఆర్బీఐ గవర్నర్ గా విధులు నిర్వహిస్తున్న ఉర్జిత్ పటేల్ కు షోకాజ్ నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో మాజీ గవర్నర్ ఈ వ్యాఖ్యలు చేయటం ప్రాధాన్యతను సంతరించుకుంది. భారత ఆర్థిక వ్యవస్థను కాపాడటమే ఆర్బీఐ లక్ష్యమని ఆ సంస్థ రఘురాం రాజన్ అన్నారు. సంస్థను పటిష్టంగా నిర్వహించడమే లక్ష్యంగా పని చేయాలని రఘురామ్ రాజన్ సూచించారు. 
దేశ ఆర్థిక వ్యవస్థకు ఆర్బీఐ సీట్ బెల్ట్ లాంటిదని చెప్పారు. ఆర్బీఐ ఎప్పుడూ రాహుల్ ద్రావిడ్ లా ఆచితూచి అడుగులు వేస్తూ ముందుకు వెళ్లాలని... సిద్ధూలా దూకుడుగా ఆడే ప్రయత్నం చేయకూడదని అన్నారు. తన వద్ద ఉన్న నిధులను సమర్థవంతంగా వినియోగించడమే కాకుండా... ప్రభుత్వ ధనం దుర్వినియోగం కాకుండా కాపాడాల్సిన బాధ్యత కూడా ఆర్బీఐపై ఉందని రాజన్ విలువైన సూచనలు చేశారు. ఆర్బీఐ బోర్డులో వివిధ రంగాల నుంచి వచ్చిన మేధావులు ఉంటారని... ప్రతి విషయాన్ని కూలంకషంగా చర్చించిన తర్వాతే నిర్ణయాలు తీసుకుంటారని రఘురామ్ రాజన్ తెలిపారు. 
 

Don't Miss