శ్రీదేవి మృతిపై వర్మ పోస్ట్ చేసిన లేఖలో ఏముంది..?

21:57 - February 28, 2018

ముంబై : శ్రీదేవి.. అంటే అతిలోక సుందరి.. దివి నుంచి భువికి దిగి వచ్చిన దేవకన్య.. అభిమానులకు అంతవరకే పరిచయం.. శ్రీదేవి జీవితంలో అభిమానులకు తెలియని ఎన్నో కోణాలున్నాయి. మోసాలు, బాధలు, కన్నీళ్లు ఎన్నో చవి చూసిన మహానటి శ్రీదేవి. ఆమె జీవితంలోని అనేక కోణాల్ని ఓ లేఖలో ఆవిష్కరించారు డైరెక్టర్ రామ్‌గోపాల్ వర్మ. నటిగా శ్రీదేవి ఎదిగిన విషయాల నుంచి బోనీ కపూర్‌తో వివాహం వరకు తనకు తెలిసిన వివరాలన్నీ ఆ లేఖలో రాశారు. ఇప్పుడు ఆ లేఖ సోషల్ మీడియాలో సంచలనం రేపుతోంది. 
మరో సంచలనానికి తెరలేపిన వర్మ 
వర్మ.. వివాదాలకు పెట్టింది పేరు. ఆయన ఏం చేసినా సంచలనమే..ఇప్పటికే పలు వివాదాల్లో చిక్కుకున్న వర్మ.. తాజాగా మరో సంచలనానికి తెరలేపారు. తను ఎంతగానో అభిమానించి.. ఆరాధించే నటి శ్రీదేవి జీవితంలో ఎదుర్కొన్న అనేక ఆటుపోట్లను..అగాథాలను వివరిస్తూ ఓ లేఖ రాశారు. ట్విట్టర్‌లో ఆ లేఖను పోస్ట్ చేశారు. వర్మ పోస్ట్ చేసిన లేఖ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. 
పంజరంలో చిక్కుకున్న పక్షిలా మారిపోయిందన్న వర్మ 
దేశంలోనే అతి పెద్ద సూపర్ స్టార్‌గా 20 ఏళ్లపాటు వెండితెరను ఏలిన శ్రీదేవి నిజ జీవితం మాత్రం పంజరంలో చిక్కుకున్న పక్షిలా మారిపోయిందని వర్మ లేఖలో ప్రస్తావించారు. తన కుటుంబం కోసం అహర్నిశలు పాటుపడుతూ తనను తాను మర్చిపోయిందని రాసుకొచ్చారు. అత్తింటి వారు అవమానించినా.. అన్నీ భరించి తన జీవితంలో చాలా కాలాన్ని దుఃఖంతో గడిపిన మహిళ శ్రీదేవి అంటూ వర్మ లేఖలో రాశారు. చివరి వరకూ తన గురించి ఆలోచించుకోకుండా జీవితాన్ని కోల్పోయిన శ్రీదేవి వచ్చే జన్మలో అయినా తన గురించి ఆలోచించుకోవాలని వర్మ లేఖలో కోరుకున్నారు. 
వర్మ లేఖపై టీవీ నటి కవితా కౌశిక్‌ మండిపాటు 
వర్మ లేఖపై ఓవైపు సినీ వర్గాలు.. అభిమానుల్లో చర్చ జరుగుతుంటే.. టీవీ నటి కవితా కౌశిక్‌ మండిపడ్డారు. శ్రీదేవి వ్యక్తిగత జీవితం గురించి ఎప్పుడు ఎందుకు ప్రస్తావిస్తున్నారంటూ వర్మకు రీట్వీట్ చేశారు కవిత. వర్మ  బయటపెట్టిన అంశాలపై స్పందించి నోరు మూయించడానికి శ్రీదేవి భౌతికంగా లేరని.. ఇంకెప్పుడు ఇలాంటివి చేయకండంటూ వర్మకు ట్వీట్‌లో వార్నింగ్ ఇచ్చారామె.
తీవ్ర విషాదంలో మునిగిపోయిన వర్మ  
మరోవైపు శ్రీదేవి మరణించినప్పటి నుంచి వర్మ తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ఆమె సినిమాలు చూస్తూ.. కాలక్షేపం చేస్తున్నారు. శ్రీదేవి అంతిమయాత్రలో ఫోటోను పోస్టు చేస్తూ 'సినీ దేవతకు తుది వీడ్కోలు' అని వర్మ ట్వీట్ చేశారు. మొత్తానికి వర్మ రాసిన లేఖలు.. ట్వీట్లు సోషల్ మీడియాలో సంచలనం రేపుతూనే ఉన్నాయి. తాజాగా వర్మ రాసిన లేఖపై ఇంకెంతమంది స్పందిస్తారో చూడాలి. 

Don't Miss