రాహుల్ టీంలో తెలంగాణ నేతలు...!

06:26 - December 7, 2017

హైదరాబాద్ : రాహుల్‌గాంధీ త్వరలోనే కాంగ్రెస్‌ అధ్యక్ష పదవి చేపట్టనున్నారు. అయితే... తెలంగాణ నుంచి ఆయన టీమ్‌లో ఎవరున్నారు ? పార్టీలో పాత, కొత్త నాయకులను యువరాజు ఎలా సంతృప్తిపరచబోతున్నారు ? కాంగ్రెస్‌ ప్రిన్స్‌ సైన్యంలో ఎవరికి చోటు దక్కనుంది? తాజాగా ఇదే అంశం పార్టీలో హాట్‌ టాపిక్‌గా మారింది.

దేశంలో యావత్తు కాంగ్రెస్‌ శ్రేణులు ఎదురుచూస్తున్న రోజు రానే వస్తోంది. గాంధీ కుటుంబం నుంచి మరో ఆశాకిరణం ఏఐసీసీ పగ్గాలు చేపట్టబోతుంది. దీంతో దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌ కేడర్‌ సంబరాల్లో మునిగితేలుతుంది. మరోవైపు పార్టీ బరువును భుజానికెత్తుకుంటున్న రాహుల్‌.. తన టీమ్‌ను ఎలా రూపొందించుకుంటారనే దానిపై హాట్‌హాట్‌గా చర్చ జరుగుతోంది.

అయితే... రాహుల్‌ తన టీమ్‌ ఎలా ఉండాలనే దానిపై స్పష్టంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఏయే రాష్ట్రాల నుంచి ఎవరెవరికి చోటు కల్పించాలనే దానిపై ఇప్పటికే కసరత్తు పూర్తయినట్లు తెలుస్తోంది. పార్టీలో కోటరీ సాంప్రదాయాలకు చెక్‌ పెట్టేలా టీమ్‌ కూర్పు ఉండేలా జాగ్రత్తలు తీసుకోబోతున్నారట. పాత, కొత్త తరాన్ని మిళితం చేస్తూ... సీనియర్ల అనుభవంతో పాటు.. యువశక్తిని కలుపుతూ తన కార్యవర్గాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది.

రాహుల్‌ ప్రత్యేకంగా కొన్ని రాష్ట్రాలపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు పలువురు నేతలంటున్నారు. అందులో తెలంగాణకు సముచిత స్థానం కల్పించబోతున్నారని... టీ-కాంగ్రెస్‌ నేతలు చెబుతున్నారు. తెలంగాణ నుంచి రాహుల్‌ టీమ్‌లో కొంతమందికి పదవులు కట్టబెడుతూనే... రాష్ట్రంలో కూడా కొన్ని పదవులు భర్తీ చేసి ఓ కొత్త లుక్‌ ఇచ్చేలా కసరత్తు చేస్తున్నారని పార్టీ వర్గాలంటున్నాయి. ప్రస్తుత పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ను కొనసాగిస్తూనే.. ఆయన టీమ్‌ను మరింత బలపేతం చేయనున్నట్లు సమాచారం.

ఇక రాహుల్‌ బృందంలో చోటు దక్కించుకునే నేతల జాబితా భారీగానే ఉండబోతుందట. ఈ లిస్ట్‌లో తెలంగాణకు ఒక సీడబ్ల్యూసీ, ఒక ప్రధాన కార్యదర్శి, ఐదు కార్యదర్శుల పదవులు ఇవ్వనున్నట్లు సమాచారం. సీనియర్‌ నేత జైపాల్‌రెడ్డిని సీడబ్ల్యూసీలోకి తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రధాన కార్యదర్శి పదవికి పీసీసీ మాజీ చీఫ్‌ పొన్నాల లక్ష్మయ్య, వీహెచ్‌లు పోటీ పడుతున్నారు. ఇందులో పొన్నాలకు మెరుగైన అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఏఐసీసీ కార్యదర్శులుగా ఉన్న చిన్నారెడ్డి, మధుయాష్కీలను కొనసాగించే అవకాశాలున్నాయి. అయితే... మరో కార్యదర్శి అయిన వీహెచ్‌ స్థానంలో... ఎస్సీ సామాజికవర్గానికి చెందిన మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహకు పదవి దక్కే అవకాశం ఉంది. ఇక ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన కేంద్ర మాజీమంత్రి బలరాంనాయక్‌ను కమిటీలోకి తీసుకోనున్నట్లు సమాచారం. ఇక బ్రాహ్మణ వర్గం నుంచి మాజీ మంత్రి శ్రీధర్‌బాబు, పీసీసీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న అరికెల వేణుగోపాల్‌రావులలో ఎవరికో ఒకరికి అవకాశం కల్పించనున్నట్లు పార్టీ వర్గాలంటున్నాయి.

ఇక రాష్ట్రం విషయానికొస్తే... పీసీసీలో మరో వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ పదవిని బీసీ సామాజికవర్గానికి ఇవ్వాలని రాహుల్‌ నిర్ణయించారట. ఈ పదవి కోసం మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌, మాజీ మంత్రి దానం నాగేందర్‌లు పోటీ పడుతున్నారు. అయితే తెలంగాణ ఉద్యమంలో కీలకంగా వ్యవహరించిన పొన్నం ప్రభాకర్‌కు ఈ పదవి ఇవ్వడం ద్వారా ఉద్యమకారుల్లో పార్టీపై సానుకూలత లభిస్తుందని యోచిస్తున్నారు. దామోదర రాజనర్సింహకు ఏఐసీసీ కార్యదర్శిగా అవకాశం కల్పిస్తూనే... అదనంగా రాష్ట్రంలో మేనిఫెస్టో కమిటీ చైర్మన్‌ పదవి కట్టబెట్టే అవకాశం ఉంది. మరోవైపు సినీనటి విజయశాంతి సేవలను దక్షిణాదిలో మరింత ఉపయోగించుకునే విధంగా పదవి ఇచ్చే యోచనలో రాహుల్‌ ఉన్నట్లు తెలుస్తోంది. అదేవిధంగా... ఇటీవల పార్టీలో చేరిన రేవంత్‌రెడ్డి సేవలను పార్టీకి ఉపయోగించుకోవాలని రాహుల్‌ నిర్ణయించినట్లు సమాచారం. రేవంత్‌కు పీసీసీ ప్రచార కమిటీ చైర్మన్‌ పదవి ఇస్తూ.. తన కోర్‌ టీమ్‌లో రేవంత్‌ను ఉంచుకునేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారట. అలాగే సీనియర్ల నుండి ఎలాంటి అసంతృప్తి తలెత్తకుండా యువరాజు చూసుకుంటున్నారని పార్టీ వర్గాలంటున్నాయి. ఇదిలావుంటే... రాహుల్‌ టీమ్‌లో చేరేందుకు పలువురు తహతహలాడుతున్నారు. ఏ అవకాశాన్ని వదులుకోకుండా.. లాబీయింగ్‌ ముమ్మరం చేస్తున్నారు. మరి యువరాజు టీమ్‌లో ఎవరికి పదవులు దక్కుతాయో చూడాలి. 

Don't Miss