బంగాళఖతంలో అల్పపీడనం

08:09 - July 17, 2017

హైదరాబాద్ : వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. దీంతో నైరుతీ రుతువనాలు చురుగ్గా కదలుతున్నాయి. ఈ ప్రభావంతో తెలుగు రాష్ట్రంలో పడుతున్న వర్షాలు మరింత విస్తృతంకానున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఈనెల 18,19 నాటికి వాయుగుండంగా మారే అవకాశం ఉంది. ఈనెల 20 నాటికి ఒడిశాలో తీరం దాటొచ్చని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలు మరింత విస్తృతమై ఈనెల 19 వరకు కొనసాగుతాయి.శ్రీకాకుళం నుంచి గుంటూరు జిల్లా వరకు భారీ వర్షాలకు ఆస్కారం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణలో 20 సెంమీటర్ల అతి భారీ వర్షాలకు కురిసే చాన్స్‌ ఉంది. వాయుగుండం తీరం దాటినా ఛత్తీస్‌గఢ్‌, తెలంగాణల్లో వర్షాలు కురుస్తాయి. గోదావరికి వరదలు వచ్చే అవకాశం ఉందని అంచనావేస్తున్నారు.

ఒడిశాలో భారీ వర్షాలు
మరోవైపు ఒడిశాలో కురుస్తున్న భారీ వర్షాలతో నాగావళి పోటెత్తుతోంది. దీంతో విజయనగరం జిల్లా పార్వతీపురం డివిజన్‌లోని కూనేరు, కొమరాడ, గురుగుబిల్లి మండలాల్లో వరద ముంపులో చిక్కుకున్నాయి. తెరవళి వంతెన కూలిపోవడంతో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఒడిశాలోని కళ్యాణ్‌సింగ్‌పూర్‌ గ్రామం నీటి మునిగింది.

పోటెత్తిన నాగావళి నది
నాగావళి నది పోటెత్తడంతో విజయనగరం జిల్లాలోని తోటపల్లి జలాశయం పూర్తిగా నిండిపోయింది. రిజర్వాయర్‌ పరిసర ప్రాంతాల్లోని గ్రామాలు నీట మునిగాయి. ముంపు గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. నిమ్మకపాడు నుంచి 12 కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. తోటపల్లి బ్యారేజ్‌లోని అన్ని గేట్లను పైకిఎత్తి 21,900 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. గంట గంటకు వరద ఉద్ధృతి పెరుగుతోంది. వరదముంపు, భారీ వర్షాల సమాచారం కోసం పార్వతీపురం ఐటీడీఏ కార్యాయంలో కంట్రోల్‌ రూము ఏర్పాటు చేశారు. కొమరాడ మండలం ఇందిరానగర్‌కు చెందిన అంకాలపు సీతారాయుడు పుశువులను తోలుకుని వెళ్లి నాగవళి నది మధ్యలో చిక్కుకుపోయాడు. ప్రాణాలు అరచేతపెట్టుకు బిక్కుబిక్కుమంటున్న సీతారాయుడును కాపాడేందుకు అగ్నిమాపక సిబ్బంది సహాయ చర్యలు చేపట్టారు. నాగవళి నది పరీవాహక ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు. 

Don't Miss