మురికికూపంగా రాజమహేంద్రవరం

12:54 - September 8, 2017

తూర్పుగోదావరి : రాజమండ్రి... శతాబ్దాల చరిత గల సుందర నగరం. ఒక వైపు వేదంగా ఘోషించే గోదావరి. మరోవైపు ప్రకృతి సోగయాలు. వీటితో రాజమహేంద్రి అమరధామంలా శోభిల్లేది. ఇదంతా గత చరిత్ర. ఇప్పుడు రాజమహేంద్రవరం మురికికూపంగా మారిందన్న విమర్శలు వెల్లువెత్తున్నాయి.  రాజమండ్రి రూపులేఖలే మార్చేస్తామని 2014 ఎన్నికల్లోహామీ ఇచ్చి, అధికారలోకి వచ్చిన బీజేపీ, టీడీపీ ప్రజా ప్రనిధులు మాటలు నీటి మూటలుగా మారాయని ప్రజలు పెదవి విరుస్తున్నారు. అధ్వానంగా మారిన రాజమండ్రిపై 10 టీవీ ప్రత్యేక కథనం... 
గోదావరి నది ఒడ్డున రాజమహేంద్రవరం
రాజమహేంద్రవరం... గోదావరి నది ఒడ్డున విలసిల్లుతున్ననగరం. వితంతు వివాహాలను ప్రోత్సహించిన కందుకూరి వీరేశలింగం వంటి సంఘ సంస్కర్తలకు నెలవు. ప్రాచీన రాతప్రతులతోపాటు ఎన్నో విలువైన గ్రంథాలకు నెలవైన గౌతమీ గ్రంథాలయం.  నగరానికి వన్నె తెచ్చే రైల్‌ కమ్‌ రోడ్డు బ్రిడ్జి. వలసపాలనకు ప్రతీకగా నిలిచే బంగ్లాలు.. ఇలా రాజమండ్రికి ఎన్నో ఘనతలు ఉన్నాయి. అయితే ఇదంతా గతం. ఇప్పుడు రాజమహేంద్రవరం మురికికూపాన్ని తలపిస్తోందన్న విమర్శలు వెల్లువెత్తున్నాయి.  పేరు గొప్ప... ఊరు దిబ్బ.. అన్న చందంగా తయారైంది.  
అభివృద్ధిని గాలికొదిలేసిన పాలకులు
కాంగ్రెస్‌ పాలకులు రాజమండ్రి అభివృద్ధిని గాలికొదిలేశారని, చారిత్రక రాజమహేంద్రవరాన్ని సుందర నగరంగా తీర్చి దిద్దుతామని మూడేళ్ల క్రితం అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పాలకులు కూడా ఇప్పటి వరకు చేసిందేమీలేదని ప్రజలు పెదవి విరుస్తున్నారు. వర్షం వస్తే పొంగిపొర్లే ఓపెన్‌ డ్రెయిన్లు,  ఎండకు దుమ్మురేగే రోడ్లు, గోదావరినది చెంతనే ఉన్నా తాగేందుకు సరిగా మంచినీరు లేక నోరెండుతున్న జనాలు... ఇలా ఎన్నో సమస్యలు ఈ నగరాన్ని పట్టిపీడిస్తున్నాయి. 
డ్రైనేజీ వ్యవస్థతో తీవ్ర ఇబ్బందులు
కొద్దిపాటి వర్షం కురిసినా పొంగిపొర్లే  డ్రైనేజీ వ్యవస్థతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. డ్రెయినేజీ వ్యవస్థ ఆధునీకరణ పేరుతో పెద్ద మురుగు కాల్వలను చిన్నవి చేస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. రోడ్లు అధ్వానంగా మారాయని మండిపతున్నారు. రాజమండ్రి పరిసరాల్లో ఉన్న పరిశ్రమల నుంచి వెలువడుతున్న పొల్యూషన్‌తో నగరం మొత్తం కాలుష్య కాసారంగా మారుతోందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 
నగరాభివృద్ధి శూన్యం : విపక్షాలు
రాజమండ్రి నగరాభివృద్ధికి స్థానిక టీడీపీ ఎంపీ మురళీమోహన్‌, బీజేపీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారారాయణ చేసింది శూన్యమని విపక్షాలు విమర్శిస్తున్నాయి. మరోవైపు నగరంలోని చాలా సమస్యలు పరిష్కరించామని, మిగిలివున్న కాలంలో మరింత అభివృద్ధి చేస్తామని రాజమండ్రి నగర బీజేపీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ చెబుతున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నింటినీ  అమలు చేసేందుకు ఇకపైనా ప్రజా ప్రతినిధులు చర్యలు  తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. 

Don't Miss