వాళ్లు అమెరికాలో.. ప్రజలు ఇబ్బంధుల్లో..

18:28 - June 18, 2017

పశ్చిమగోదావరి : రాజమండ్రి జనం అంతా ఇప్పుడు అమెరికా వైపు చూస్తున్నారు. తమకు అందుబాటులో ఉండాల్సిన ప్రజాప్రతినిధులంతా అమెరికాలో మకాం వేస్తే తమ సమస్యలు ఎవరికి చెప్పుకోవాలో అర్ధం కాక సతమతమవుతున్నారు. ఎంపీ, ఎమ్మెల్యేల అమెరికా టూర్లతో రాజమహేంద్రవరంలో పడకేసిన పాలనపై టెన్ టీవీ ప్రత్యేక కథనం. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి.. ఇక్కడ పేరుకే ప్రజా ప్రతినిధులన్న చందంగా తయారైంది. ప్రజల గోడు పట్టించుకోవాల్సిన ప్రజా ప్రతినిధులంతా ప్రజలకు అందుబాటులో లేకపోవడంతో సమస్యలన్నీ పేరుకుపోయాయి. రాజమండ్రి ఎంపీ మురళీ మోహన్.. మామూలుగానే ఆయన ప్రజలకు అందుబాటులో ఉండరనే విమర్శలు ఉన్నాయి. కాగా ప్రస్తుతం తానా మహాసభలంటూ గత 15 రోజులుగా ఆయన అమెరికా టూర్‌లో ఉన్నారు. దీంతో ఆయన నియోజకవర్గానికి వచ్చే అవకాశమే లేకుండా పోయింది. కొద్దిరోజుల క్రితం ఆయన కోడలు మాత్రం నియోజకవర్గంలో పర్యటించడం విశేషం. ఇక రాజమండ్రి సిటి ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ కూడా వ్యక్తిగత పనుల కోసం అమెరికా వెళ్లిపోయారు. పదిరోజులుగా ఆయన అక్కడే మకాం వేశారు. చివరకి బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు వచ్చి సభ పెడితే ఆ సభకు ఆయన దూరంగా ఉన్నారు. దీంతో ప్రజా సమస్యలన్నీ పెండింగ్‌లో పడిపోయాయి.

ప్రజల ఇబ్బందులు..
ఇక వీళ్లిద్దరి కన్నా ముందే రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి అమెరికా వెళ్లారు. ఆయన వెళ్లి నెల రోజులు అవుతోంది. క్యాబినెట్ విస్తరణలో సీఎం చంద్రబాబు మీద కారాలు, మిరియాలు నూరిన ఆయన పార్టీ సమావేశాలకు దూరంగా ఉంటున్నారు. మహానాడుకు కూడా గైర్హాజరైన ఆయన అమెరికాలో కూతురి ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నారు. ఇలా వీరంతా అమెరికా బాట పట్టడంతో తమ సమస్యలు ఎవరికి చెప్పుకోవాలో అర్ధం కావట్లేదని రాజమండ్రి ప్రజలు ఆవేదన చెందుతున్నారు. నియోజకవర్గానికి అందుబాటులో ఉండాల్సిన నేతలంతా ఇలా ఫారిన్ టూర్లో బిజీగా గడుపుతుంటే తమ సమస్యలు ఎవరు పరిష్కరిస్తారని ప్రశ్నిస్తున్నారు. తాము ఓటేస్తే గెలిచిన నేతలంతా పత్తా లేకుండా పోవడంపై రాజమండ్రి వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో వీరికి తగిన బుద్ధి చెబుతామంటున్నారు.

Don't Miss