రాజశేఖర్ తో గోపిచంద్ కు సమస్యలు...

09:35 - June 17, 2016

ఏంటీ అప్పటి హీరో రాజశేఖర్ తో ఇప్పటి హీరో గోపించంద్ కు సమస్యలా ? ఎలాంటి సమస్యలు సృష్టిస్తున్నారు ? ఇలా అనేక ప్రశ్నలు ఉదయించవచ్చు. కానీ ఇవన్నీ నిజ జీవితంలో కాదు. సినిమాలో అవును గోపిచంద్ నటించబోయే చిత్రంలో రాజశేఖర్ విలన్ గా నటించే అవకాశాలున్నాయని కథనాలు వెలువడుతున్నాయి. శ్రీవాస్ దర్శకత్వంలో గోపిచంద్ కథానాయకుడిగా ఓ చిత్రం రూపుదిద్దుకోవడానికి సన్నాహాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో రాజశేఖర్ ని ఎంచుకోవాలని చిత్ర యూనిట్ నిర్ణయించుకుందని తెలుస్తోంది. గోపీచంద్ తో 'లక్ష్యం', 'లౌక్యం' చిత్రాలు చేసి హిట్ కొట్టిన దర్శకుడు శ్రీవాస్‌. ఇప్పుడు ఈ కాంబినేషన్‌ హ్యాట్రిక్‌ కొట్టాలని తన బ్యానర్ పైనే సినిమా చేస్తున్నారు.
ఆహుతి, తలంబ్రాలు చిత్రాలతో నెగిటివ్ రోల్స్ తోనే కెరీర్ మొదలెట్టి హీరో గా సక్సెస్ అయిన రాజశేఖర్ మళ్లీ విలన్ గా చేస్తే తమ సినిమాకు మైలేజి బాగా వస్తుందని దర్శకుడు శ్రీవాస్ భావించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం స్క్రిప్టు పనులు జరుగుతున్నట్లు తెలుస్తోంది. యాక్షన్‌, వినోదం మేళవించిన ఈ చిత్రంలో కుటుంబ బంధాలకూ ప్రాధాన్యం ఉంటుందని శ్రీవాస్ పేర్కొంటున్నారు. గోపీచంద్‌ ప్రస్తుతం 'ఆక్సిజన్‌' చిత్రంతో బిజీగా ఉన్నారు. అది పూర్తయ్యాకే శ్రీవాస్‌ సినిమా పట్టాలెక్కే అవకాశాలున్నాయి.

Don't Miss