రజనీ మనసులో మాట ఇదే..

21:29 - May 15, 2017

చెన్నై : తనకు రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం లేదని తమిళ సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ స్పష్టం చేశారు. ఒకవేళ దేవుడు ఆజ్ఞపిస్తే రాజకీయాల్లోకి వస్తానన్నారు. తనని నటించడం కోసమే భగవంతుడు ఆదేశించారని చెప్పారు. కొంత మంది రాజకీయ లబ్ది కోసం తన పేరును దుర్వినియోగం చేస్తున్నారని ధ్వజమెత్తారు. చెన్నైలోని రాఘవేంద్ర కళ్యాణ మంటపం తమిళ సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ అభిమానులతో కోలాహలంగా కనిపించింది. దాదాపు ఎనిమిదేళ్ల విరామం తరువాత సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ తన అభిమానులతో​ ప్రత్యక్షంగా సమావేశం అయ్యారు. తన భవిష్యత్‌ ప్రణాళికను వారితో పంచుకున్నారు.

ముత్తురామన్ తో..
సీనియర్‌ దర్శకుడు ముత్తురామన్‌తో కలిసి రజనీకాంత్‌ అభిమానుల నుద్దేశించి మాట్లాడారు. అభిమానుల ఆకాంక్షలను ఎట్టి పరిస్థితుల్లో వమ్ము చేయని చెప్పారు. తనకు రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం లేదని స్పష్టం చేశారు. రాజకీయాల్లోకి రావడానికి రజనీ భయపడుతున్నాడు...తనను పిరికివాడంటున్న కొందని విమర్శలను పట్టించుకునే అవసరం లేదని రజనీకాంత్‌ అన్నారు. కొన్ని పరిస్థితుల దృష్ట్యా 1996లో డీఎంకేకు మద్దతు ఇవ్వాల్సి వచ్చిందని... కొంతమంది తమ రాజకీయ లబ్ధి కోసం తన పేరును వాడుకుంటున్నారని మండిపడ్డారు. నేను ఏ పార్టీలోనూ చేరను. ఇప్పటివరకు తనని నటించమనే దేవుడు ఆదేశించాడు. ఆ పనే చేస్తాను. భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలియదని రజనీ చెప్పారు. నా అభిమానులు నిజాయితీగా జీవించాలని రజనీకాంత్‌ ఆకాంక్షించారు. మద్యపానం, ధూమ పానానికి దూరంగా ఉండి మానసిక ప్రశాంతత పొందాలని రజనీకాంత్ సూచించారు. ఈ నెల 28 నుంచి కొత్త సినిమా షూటింగ్‌లో పాల్గొంటానని చెప్పారు. అనంతరం ఆయన నాలుగు జిల్లాలకు చెందిన అభిమానులతో ఆయన ఫొటోలు దిగారు.

Don't Miss