నా దారి రహదారి అంటున్న రజనీ...

20:55 - January 2, 2018

నా దారి రహదారి.. లేట్ గా వచ్చినా లేటెస్ట్ గా వస్తా... దేవుడు శాసిస్తాడు.. నేను చేస్తాను..ఇవన్నీ రజనీ దశాబ్దాలుగా చెప్తున్న మాటలు. ఇప్పుడు మాటలనుంచి చేతల సమయం వచ్చింది. పొలిటికల్ ఎంట్రీ ప్రకటనతో ఒక్కసారిగా తమిళ రాజకీయాల్లో కలకలం రేగింది. ఎన్నాళ్లో వేచిన ఉదయం అంటూ ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. మరి తమిళ రాజకీయాల్లో రజనీ ఎలాంటి ప్రభావం చూపిస్తారు.సూపర్ స్టార్ రజనీకాంత్....సినిమాల్లోనే కాదు.. తమిళనాట ఈ పేరు అన్నిరకాలుగా ప్రభంజనమే. కోట్లాది అభిమానులున్న ఈ సూపర్ స్టార్ పొలిటికల్ ఎంట్రీ ప్రకటనతో సీన్ ఒక్కసారిగా వేడెక్కింది. జయ మరణం తర్వాత అనేక మలుపులు తిరుగుతున్న తమిళ రాజకీయాల్లో ఏర్పడిన శూన్యాన్ని ఇప్పుడు రజనీ భర్తీ చేస్తాడా? ఆయన దారి రహదారి. సినిమా డైలాగే కానీ... రజనీ తీరుని చెప్తుందని ఫ్యాన్స్ నమ్మకం. మరి ఇది సినిమాల వరకేనా, లేక పాలిటిక్స్ లో కూడానా? ఇప్పుడు రజనీకాంత్ ఎంట్రీ తో పరిస్థితులు ఎలా మారతాయి..? డీఎంకే, అన్నా డీఎంకే లను చావు దెబ్బతీస్తారా? లేక విపరీతమైన హైప్ తో వచ్చి చతికిల పడిన కొందరు నటుల్లా రజనీ మిగిలిపోతారా? ప్రకటించేశాడు..వెబ్ సైట్ ప్రారంభించేశాడు..అభిమానులను సన్నద్ధం కావాలంటూ పిలుపునిచ్చాడు..ఏం చేస్తానో చెప్తాను.. చేయలేకపోతే రాజీనామా చేస్తాను అంటున్నాడు.. రెండు దశాబ్దాల ఉత్కంఠకు తెరదింపాడు..

రేపెవరిది... ఇదే తమిళనాడులో వినిపిస్తున్న ప్రశ్న. ఈ రోజు ఎవరేంటో అందరికీ తెలుసు..కానీ, రేపటిని గెలుచుకునేదెవరు? ప్రజల గుండెల్లో పాగా వేసేదెవరు? అధికార పీఠాన్ని అధిరోహించేదెవరు? ఇవే తమిళనాడులో వినిపిస్తున్న ప్రశ్నలు. ఈపీఎస్, ఓపీఎస్, శశికళ, స్టాలిన్ మొదలైన రెగ్యులర్ ప్లేయర్స్ తో పాటు, లేటెస్ట్ గా రజనీ, ఈ మధ్యే ఉత్సాహంగా మారిన కమల్ లాంటి స్టార్ హీరోలు.. కనిపిస్తున్న ఫీల్డ్ లో పైచేయి ఎవరు సాధించబోతున్నారు? ఆల్రెడీ ఈ బాటలో ఉన్న నటులు ఏం సాధించారు. అది ఇప్పటి చరిత్ర కాదు.. దశాబ్దాల నుండి పీఠంపై సినీ తారలనే కూర్చోబెడుతున్నారు. అక్కడ ఫిల్మ్ స్టార్స్ కే పట్టంకడుతున్నారు. దక్షిణాదినే కాదు.. ఆ మాటకొస్తే, దేశం మొత్తంమీద కూడా ఆ రాష్ట్ర రాజకీయాలకు చాలా ప్రత్యేకత ఉంది. ఈ వరుసలో రజనీ పాలిటిక్స్ లో ఎంటరైతే దుమ్మురేపటం ఖాయమా? సినీ నటుల తళుకుబెళుకులే ప్రధానంగా నిలుస్తున్నతమిళ రాజకీయాల్లో ప్రస్తుతం ఉన్నవాళ్లంతా ఇమేజ్ వాడిపోయిన తారలే. ఇలాంటి సందర్భంలో రజనీ ఎంట్రీ ఇస్తే అది... చెప్పుకోదగ్గ మార్పులకు కారణం అవుతుందా...రాజకీయ శూన్యం నుండి కొత్త శక్తులు పుట్టుకురావటం కొత్త విషయం కాదు.. వివిధ రాష్ట్రాల రాజకీయాల్లో దీనికి అనేక ఉదాహరణలు ఉన్నాయి. ఇప్పుడు తమిళనాట అదే దృశ్యం కనిపిస్తోంది. మరి దీనిని రజనీకాంత్ తనకు అనుకూలంగా మలుచుకుంటాడా, అభిమానుల ఆశలు నెరవేరుస్తాడా అనే అంశం త్వరలో తెలిసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Don't Miss