ఎవరు గెలుస్తారు ? ఎవరు ఓడుతారు ?

06:59 - March 13, 2018

హైదరాబాద్ : తెలంగాణలో రాజ్యసభ అభ్యర్థుల రాజకీయం రసవత్తరంగా మారింది. రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు అనివార్యంగా కనిపిస్తున్నాయి. రాజ్యసభ ఖాళీలు మూడు ఉంటే.. బరిలో నలుగురు అభ్యర్థులు ఉన్నారు. దీంతో పోటీ అనివార్యమైంది. దీంతో ఎవరు గెలుస్తారు.. ఎవరు ఓడుతారన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. టీఆర్‌ఎస్‌ ముగ్గురు అభ్యర్థులను దింపడం వరకు బాగానే. ఇక్కడే అసలు కథ మొదలైంది. బరిలో కేవలం టీఆర్‌ఎస్‌ ముగ్గురు అభ్యర్థులు ఉంటే ఏ చిక్కా ఉండేది కాదు. పైగా ఎన్నికలు నిర్వహించకుండానే ఏకగ్రీవంగా ముగ్గురు సభ్యులు ఎన్నికయ్యేవారు. కానీ ప్రతిపక్షపార్టీ అయిన కాంగ్రెస్‌ కూడా.. అభ్యర్థిని బరిలో నిలిపింది. గతంతో ఎంపీగ పనిచేసిన బలరాం నాయక్‌ను రాజ్యసభ బరిలో దించుతున్నట్టు ప్రకటించింది. దీంతో పోటీ అనివార్యం అయ్యింది.

వాస్తవానికి టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు గెలవడానికే ఎక్కువగా అవకాశం ఉంది. టీఆర్‌ఎస్‌కు ఎంఐఎం కూడా మద్దతునిస్తోంది. దీంతో అధికారపార్టీ బలం పెరిగింది. మూడు స్థానాలను గెలుచుకునే సంఖ్యా బలం ఆ పార్టీకి ఉన్నది. పార్టీల బలాల బలాలను గమనిస్తే.. టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు 65 మంది ఉన్నారు. కాంగ్రెస్‌ నుంచి 12, టీడీపీ నుంచి ఏడుగురు, బీఎస్‌పీ నుంచి ఇద్దరు టీఆర్‌ఎస్‌లో చేరారు. వైసీపీ నుంచి ముగ్గురు, సీపీఐ నుంచి ఒక ఎమ్మెల్యే కూడా టీఆర్‌ఎస్‌లో చేరిపోయారు. అంటే ప్రస్తుతం టీఆర్‌ఎస్‌కు ఇతర పార్టీలో చేరే వారితో కలుపుకుంటే మొత్తంగా...90మంది ఎమ్మెల్యేల బలం ఉంది. ఇక వీరికి మరో 7 మంది ఎంఐఎం ఎమ్మెల్యేలు మద్దతు తెలుపుతున్నారు. అంటే టీఆర్‌ఎస్‌ అభ్యర్థులకు మొత్తంగా 97 మంది ఎమ్మెల్యేల సపోర్ట్‌ ఉందన్నమాట. దీంతో ముగ్గురు అభ్యర్థులను గెలిపించుకోనే బలం టీఆర్‌ఎస్‌కు ఉంది.

ఫార్టీ ఫిరాయింపుల వ్యవహారం చర్చనీయాంశం చేయడమే లక్ష్యం. మరి కాంగ్రెస్‌ అభ్యర్థిని ఎందుకు నిలిపిందనేదే ఇక్కడ చర్చించాల్సిన విషయం. వాస్తవానికి కాంగ్రెస్‌కు ప్రస్తుతం 12మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. రేవంత్‌రెడ్డి, ఓ ఇండిపెండెంట్‌ను కలుపుకుంటే వీరి సంఖ్య 14కు చేరింది. రాజ్యసభ అభ్యర్థి గెలవడానికి ఈ బలం ఏమాత్రం సరిపోదు. మరి అన్ని తెలిసీ అభ్యర్థిని నిలపడం వెనుక అసలు కథ ఏంటన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. పార్టీ ఫిరాయింపుల ఎమ్మెల్యేల వ్యవహారాన్ని మరోసారి చర్చనీయాంశం చేయాలన్న లక్ష్యంతోనే కాంగ్రెస్‌ అభ్యర్థిని నిలిపినట్టు తెలుస్తోంది.

మూడు స్థానాలు ఏకగ్రీవంగా తమకే దక్కుతాయని అధికార టీఆర్‌ఎస్‌ భావిస్తోంది. అయినా ప్రతిపక్షపార్టీ అభ్యర్థిని నిలపడంతో పోటీ తప్పడం లేదు. అయితే బీజేపీకి 5మంది ఎమ్మెల్యేలు, సీపీఎంకు ఒక ఎమ్మెల్యే ఉన్నారు. మరి వీరు ఏ నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తి రేపుతోంది.

Don't Miss