రామకృష్ణ చనిపోయి ఇవాళ్టికి 16 ఏళ్లు

13:54 - September 8, 2017

ఖమ్మం : ఆగస్టు 28.. ఆవేశం కట్టలు తెంచుకున్న రోజు. ప్రజలకు భారమైన విద్యుత్‌ చార్జీలు తగ్గించాలని ప్రజలు గొంతెత్తిన రోజు. అప్పటి తెలుగు దేశం ప్రభుత్వాన్ని వామపక్షాలన్నీ కలిసి నిలదీసిన రోజు. శాంతియుతంగా ఉద్యమం చేస్తున్న ఆందోళనకారులపై పోలీసులు పాశవికంగా కాల్పులు జరిపిన రోజు. ఆ దారుణ మారణ కాండకు ముగ్గురు వీరులు బలయ్యారు. ఇందులో ఖమ్మం జిల్లా ముద్దు బిడ్డ కామ్రెడ్ సత్తెనపల్లి రామకృష్ణ ఒకరు. పోలీసు కాల్పుల్లో గాయపడి 12 రోజుల పాటు మృతువుతో పోరాడి.. సెప్టెంబర్‌ 8న తుది శ్వాస విడిచాడు. రామకృష్ణ వర్ధంతి సందర్భంగా 10టీవీ ప్రత్యేక కథనం. 
రామకృష్ణది సీపీఎంలో చురుకైన పాత్ర 
ప్రజా ఉద్యమంలో సత్తెనపల్లి రామకృష్ణ పాత్ర అమోఘం. రామకృష్ణ ఖమ్మం నగరంలో డివైఎఫ్‌ఐలో పని చేస్తూ.. సీపీఎంలో చురుకైన పాత్ర పోషించారు. పేదలకు ఇళ్ల స్థలాలు ఇప్పించటంలో.. ప్రజా సమస్యలపై పోరాడటంలో రామకృష్ణ ముందుండేవారు. పార్టీ అవసరాల కోసం చేతివృత్తిదారుల సంఘం రాష్ట్ర కార్యదర్శిగా పని చేస్తూ హైదరాబాద్‌కు వచ్చారు.
12 రోజులు మృత్యువుతో పోరాటం 
విద్యుత్‌ ఛార్జీల పెంపునకు వ్యతిరేకంగా 2000 సంవత్సరం ఆగస్టు 28న పెద్ద ఉద్యమమే జరిగింది. వామపక్షాల ఆధ్వర్యంలో జరిగిన ఆ పోరాటంలో.. రామకృష్ణ బషీర్‌బాగ్ చౌరస్తాలో ముందు వరసలో ఉన్నారు. అప్పటి టీడీపీ ప్రభుత్వ హయాంలో పోలీసులు పాశవికంగా జరిపిన కాల్పుల్లో.. తీవ్రంగా గాయపడ్డాడు. రామకృష్ణ దాదాపు 12 రోజులు మృత్యువుతో పోరాడి.. చివరికి సెప్టెంబర్‌ 8న తుదిశ్వాస విడిచాడు. రామకృష్ణ చనిపోయి ఇవాళ్టికి 16 ఏళ్లు. 
రామకృష్ణ ఆశయ సాధనలో ఆయన కుటుంబం 
సత్తెనపల్లి రామకృష్ణ కుటుంబం ముందు నుంచి వామపక్ష భావాలున్న కుటుంబం. వీళ్లు రామకృష్ణ ఆశయ సాధన కోసం ఎర్రజెండా నీడలోనే ముందుకు సాగుతున్నారు. రామకృష్ణ భార్య మంగ, కూతురు రమ్య, తండ్రి వెంకటయ్య, తల్లి యశోద, సోదరులు శ్రీనివాసరావు, రాము, ప్రజా ఉద్యమాల్లో పాలు పంచుకుంటూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. 
కరెంట్ చార్జీల పెంపు నిలిపివేత 
అప్పుడు నిర్వహించిన విద్యుత్‌ ఉద్యమం ఫలితంగా.. తరువాత వచ్చిన ప్రభుత్వాలు తాత్కాలికంగా కరెంట్ చార్జీల పెంపును నిలిపేశాయి. ప్రజల కోసం ప్రాణాలర్పించిన సత్తెనపల్లి రామకృష్ణను స్ఫూర్తిగా తీసుకొని విప్లవ జోహార్లు అర్పిస్తున్నారు కామ్రెడ్లు. 

 

Don't Miss