కార్పొరేట్ భూదాహనికి రైతుల బలి

08:24 - August 13, 2017

నల్లగొండ : జిల్లా... చిట్యాల మండలంలో... కార్పొరేట్‌ దందా బయటపడింది. రాంకీ సంస్థ భూ దాహానికి... రైతులు బలయ్యారు. వారి భూముల నుంచి వారినే దూరం చేశారు. దీంతో రైతులు న్యాయం కోసం ఎదురుచూస్తున్నారు. వెలిమినేడు, గుండ్రాంపల్లి గ్రామాల మధ్య పలు పరిశ్రమలు పెట్టేందుకు సుమారు 1400 ఎకరాలను రాంకీ సంస్థ సేకరించింది. ఆరు సంవత్సరాల క్రితం ఎకరానికి 3 లక్షల నుంచి 4 లక్షల రూపాయలు చెల్లించి... కొంతమంది రైతుల నుంచి భూమిని కొనుగోలు చేసింది. అయితే సంస్థ తమ అవసరాల కోసం భూముల్ని ముంబై బ్యాంకుల్లో మార్టిగేజ్ చేస్తూ.. సేల్ డీడ్‌ను ఎకరానికి 30 లక్షలుగా చూపించింది. దానికి సంబంధించిన ఆదాయపన్నును చెల్లించాలని ఐటి శాఖ ఇటీవల పలువురు రైతులకు నోటీసులు జారీ చేసింది. అయితే భూమిని అమ్మని రైతులకు కూడా ఈ నోటీసులు అందాయి. దీంతో వారంతా గందరగోళానికి గురయ్యారు. తర్వాత విషయం తెలిసి రైతులు ఆందోళనకు గురయ్యారు.

నకిలీ పత్రాలు సృష్టించి
రాంకీ సంస్థ తరపు భూ లావాదేవీలు జరిపిన కొందరు మధ్యవర్తులు... అక్రమంగా కొంతమంది రైతుల భూములను సొంతం చేసుకుంటున్నట్టు తెలుస్తోంది. వెలిమినేడు గ్రామానికి చెందిన రైతుల భూములను కొనుగోలు చేసేటప్పుడు ఆ భూమి చుట్టుపక్కల ఉన్న భూములను కూడా సదరు రైతులకు తెలియకుండా చౌటుప్పల్‌లోని రిజిస్ట్రార్‌ కార్యాలయంలో సంస్థ పేరుతో రిజిస్ట్రేషన్‌ చేశారు. ఇలా ఒక్క వెలిమినేడులోనే దాదాపు 30 మంది రైతుల నుంచి సుమారు 74 ఎకరాలకు పైగా నకిలీ పత్రాలు సృష్టించి రాంకీ సంస్థ పేరుతో రిజిస్ట్రేషన్‌ చేయించారు. గుండ్రాంపల్లిలోనూ ఇలా 40 ఎకరాలకు పైగా అక్రమ రిజిస్ట్రేషన్లు చేయించుకున్నట్టు సమాచారం.

ఆత్మహత్యలే శరణ్యం
విషయం తెలుసుకున్న రైతులు... అధికారులను కలిసినా... వారు పట్టించుకోలేదు. దీంతో వారంతా సీపీఎం, ప్రజా సంఘాలను ఆశ్రయించారు. వారు వెలిమినేడులోని బాధిత రైతుల భూములను సందర్శించారు. భూముల పత్రాలను పరిశీలించారు. రాంకీ సంస్థతో కుమ్మక్కై అక్రమ రిజిష్ట్రేషన్‌కు రెవెన్యూ, రిజిష్ట్రేషన్ అధికారులు సహకరించారని.. వారి మద్దతు లేకుండా రిజిష్ట్రేషన్ జరగదని ప్రజాసంఘాల నేతలు అభిప్రాయపడ్డారు. ఈ భూముల్లో... రాంకీ సంస్థ నాటిన హద్దు రాళ్లను సైతం ప్రజాసంఘాల నేతలు తొలగించారు. రైతులను మోసం చేసిన రాంకీ సంస్థపైనా.. అధికారుల పైనా కఠిన చర్యలు తీసుకోవాలని..డిమాండ్‌ చేశారు. తమ భూములు తమకు అప్పగించాలని బాధిత రైతులు డిమాండ్ చేస్తున్నారు. లేదంటే ఆత్మహత్యలే శరణ్యమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. ఈ అక్రమాలకు పాల్పడిన అధికారులపై... రాంకీ సంస్థపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా చౌటుప్పల్‌లోని సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో 2012 ప్రాంతంలో పనిచేసిన ఓ మహిళా అధికారి ఈ భూబాగోతంలో కీలక పాత్ర పోషించినట్టు రైతులు ఆరోపిస్తున్నారు. 

 

 

Don't Miss