కల్వకుర్తి సీబీఎమ్‌ లో అరుదైన చికిత్స..

19:14 - December 14, 2016

నాగర్‌కర్నూల్‌ : కల్వకుర్తిలోని సీబీఎమ్‌ ప్రజా వైద్య శాలలో అరుదైన శస్త్రచికిత్స నిర్వహించారు.. ఓ వృద్ధురాలి కడుపులోంచి దాదాపుగా ఐదు కిలోల కణితిని తొలగించి.. ఆమె ప్రాణాలను నిలబెట్టారు.

4 కిలోల 750 గ్రాముల కణితి తొలగింపు
నాగర్‌కర్నూలు జిల్లా కల్వకుర్తిలోని విద్యానగర్‌కు చెందిన 73 ఏళ్ల లింగమ్మ కొంతకాలంగా కడుపునొప్పితో బాధపడుతోంది. నొప్పితో పాటు కడుపు కూడా ఉబ్బడంతో స్థానికంగా ఉన్న సీబీఎం ప్రజావైద్యశాలలో పరీక్ష చేయించుకుంది. సంబంధిత పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు లింగమ్మ కడుపులో కణితి ఉన్నట్టు గుర్తించారు. దీంతో మంగళవారం ఉదయం శస్త్రచికిత్స చేసి లింగమ్మ కడుపులోంచి 4 కిలోల 750 గ్రాముల బరువున్న కణితిని.. ఎడమ భాగంలోఉన్న మరో చిన్న కణితిని తొలగించారు.

మహిళల్లోనే ఇలాంటి సమస్యలు వస్తాయి : డాక్టర్‌ వంశీకృష్ణ
లింగమ్మకు తలెత్తిన సమస్యను మల్టీ లాక్‌లేటెడ్‌ ఒబేరియన్‌ షిప్ట్‌ అంటారని శస్త్రచికిత్స నిర్వహించిన సీబీఎం ప్రజావైద్యశాల వైద్యులు వంశీకృష్ణ చెప్పారు. ముఖ్యంగా మహిళల్లోనే ఇలాంటి సమస్యలు వస్తాయన్నారు. కణితిని బయాప్పీకి పంపి.. ఆ ఫలితాల ఆధారంగా తదుపరి లింగమ్మకు చికిత్స అందిస్తామని, ప్రస్తుతానికి ఆమె ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని డాక్టర్‌ వంశీకృష్ణ తెలిపారు. అతి తక్కువ ఖర్చుతో శస్త్రచికిత్సను నిర్వహించి ప్రాణాలు కాపాడిన డాక్టర్‌ వంశృకృష్ణకు.. లింగమ్మ కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.

Don't Miss