రథసప్తమికి సిద్ధమైన అరసవల్లి

19:12 - January 23, 2018

శ్రీకాకుళం : బుధవారం అరసవల్లి శ్రీ సూర్యనారాయణ ఆలయంలో రథసప్తమి వేడుకలు ఘనంగా జరగనున్నాయి. సూర్యనారాయణ స్వామి సన్నిధిలో దాదాపు 36 గంటల పాటు ఈ వేడుకలు జరగనున్నాయి. ఈ రోజు రాత్రి 12:15 నిమిషాలకు స్వామివారి క్షీరాభిషేకంతో వేడుకలు ప్రారంభమవుతాయి. అనంతరం విశేష పూజలు, ఇతర సేవలు నిర్వహిస్తారు. సూర్య నారాయణ స్వామి దర్శనానికి తెలుగు రాష్ట్రాలతో పాటు ఒడిశా రాష్ట్రం నుండి లక్షలాదిమంది భక్తులు తరలిరానున్నారు. ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ ధనుంజయ రెడ్డి అధికారులతో సమీక్ష నిర్వహించారు. భక్తులకు ఏలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని సిబ్బందిని ఆదేశించారు. వేడుకల్లో మొత్తం ఎనిమిది ప్రభుత్వ శాఖలు సేవలు అందించనున్నాయి. భక్తులకు ఇబ్బందులు కలగకుండా భారీ క్యూలైన్లను ఏర్పాటు చేశారు.

వీఐపీ దర్శనానికి వచ్చే వారికి
ఉచిత దర్శనంతో పాటు.. వీఐపీ దర్శనానికి వచ్చే వారికి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు. క్యూలైన్లలో త్రాగునీరు, వైద్య శిబిరాలు, వృద్ధులు, వికలాంగులు కోసం బ్యాటరీ సహాయంతో నడిచే వాహనాలు సిద్ధం చేశారు. ఇంద్ర పుష్కరిణి వద్ద గజ ఈతగాళ్లను ఉంచి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని కలెక్టర్ ఆదేశించారు. రథసప్తమి వేడుకలకు హాజరయ్యే భక్తుల కోసం విరివిగా పార్కింగ్ స్థలాలు, చెప్పుల స్టాండులు ఏర్పాటు చేశారు. పారిశుద్ధ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని నగరపాలక సంస్థ అధికారులను కలెక్టర్‌ ఆదేశించారు.

 

 

Don't Miss