బిందుసేద్యపు శిరులు..

16:15 - January 10, 2017

సూర్యాపేట : వ్యవసాయంపై ఉన్న ఇష్టంతో వర్షాభావ పరిస్థితులకు ఎదురొడ్డాడు ఓ రైతు. ఉన్న కొద్దిపాటి నీటిని సద్వినియోగం చేసుకుంటూ సిరులు కురిపిస్తున్నాడు. వాతావరణ పరిస్థితులతో సంబంధం లేకుండా.. బిందు సేద్యంతో అల్లం సాగు చేస్తూ లాభాల దిశగా పయనిస్తున్నాడు. ఓ కొత్త ఆలోచన ఆ రైతుకు సిరులు కురిపిస్తోంది. నీళ్లు లేవని అధైర్యపడకుండా.. పరిస్థితులకనుగుణంగా సాగు చేస్తున్నాడు. దీంతో తక్కువ నీటితో సేద్యం చేస్తూ లాభాలు ఆర్జిస్తున్నాడు.

బిందుసేద్యంతో వ్యవసాయం
ఈయన పేరు శ్రీనివాసరెడ్డి. సూర్యాపేట జిల్లా కోదాడ మండలం గుడిబండలో వ్యవసాయం చేస్తున్నాడు. తనకు సాగర్‌ కాలువ చివరలో ఐదెకరాల భూమి ఉంది. వర్షాభావ పరిస్థితులతో సాగు చేయడం కష్టంగా ఉండేది. దీంతో వినూత్నంగా ఆలోచించాడు. పొలంలో బావులు తవ్వించాడు. ఉన్న కొద్దిపాటి నీటితో సేద్యం చేయాలంటే.. బిందు సేద్యం కరెక్ట్‌ అని భావించాడు. దానికనుగుణంగా పైపులు ఏర్పాటు చేసి.. వ్యవసాయం చేశాడు.

ఇతర వాణిజ్య పంటల గురించి ఆరా..అల్లం సాగుపై దృష్టి

ఇక అందరూ పండించే వరి కాకుండా.. వేరే ఇతర వాణిజ్య పంటలు పండించాలనుకున్నాడు. తక్కువ నీటితో పండే పంటల గురించి తెలుసుకున్నాడు. మెదక్‌ జిల్లాలో సాగు చేసే అల్లం సాగుపై దృష్టి సారించాడు. అక్కడి రైతుల నుంచి వివరాలు సేకరించి.. కేరళ నుంచి మారన్‌ రకం విత్తనం తెచ్చి సాగు చేశాడు. డ్రిప్‌ సాయంతో పంట పండిస్తున్నాడు. అయితే.. అల్లం సాగుకు అన్ని ప్రాంతాలు అనుకూలించవు. దానికి ఉష్ణోగ్రత తక్కువగా ఉండాలి. ఇందుకోసం అల్లం పంటకు పక్కనే స్వీట్‌కార్న్‌ కూడా పండించాడు. దీంతో మొక్కజొన్నల ద్వారా ఆదాయంతో పాటు.. అల్లం సాగుకు నీడ కూడా లభించింది. అల్లం పంటకు 10 నెలల సమయం పడనున్న నేపథ్యంలో.. ఇప్పుడు వాటికి నీడ కోసం ఆముదం పండిస్తున్నాడు. అయితే.. 15 టన్నుల వరకు అల్లం దిగుబడి వస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నాడు. మొత్తానికి లాభం లేకపోయినా.. నష్టం వచ్చే ప్రసక్తే లేదంటున్నాడు శ్రీనివాసరెడ్డి. ప్రతి రైతూ వినూత్నంగా ఆలోచించి సేద్యం చేస్తే.. సిరులు పండించడం సాధ్యమే అంటున్నాడు.

 

Don't Miss