వాడవాడలా....మువ్వెన్నల జెండా

20:58 - January 26, 2018

హైదరాబాద్ : వాడవాడలా.... మువ్వెన్నల జెండా రెపరెపలాడింది. పిల్లలు, పెద్దలు.. గణతంత్ర దినోత్సవంలో భాగమై...దేశ భక్తిని చాటుకున్నారు. ప్రముఖులు జెండాను ఆవిష్కరించి.. రాజ్యాంగం గొప్పదనాన్ని.. రాజ్యాంగ నిర్మాత బీఆర్‌ అంబేద్కర్‌ కృషిని కొనియాడారు. తెలుగు రాష్ట్రాలలో గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. పెద్దలు, ప్రముఖులు ఈ సంబరాల్లో భాగమయ్యారు. తెలంగాణాలోని అన్ని జిల్లాల్లోనూ... రిపబ్లిక్‌ డే వేడుకలు అట్టహాసంగా సాగాయి. ముఖ్యమంత్రి అధికార నివాసం.. ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌ జాతీయ జెండాను ఆవిష్కరించి.. వందనం చేశారు. హైకోర్టులో యాక్టింగ్‌ చీఫ్‌ జస్టీస్‌ రమేశ్‌ రంగనాథన్‌ జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో.. ఎమ్మెల్సీ రామచందర్‌రావు పాల్గొన్నారు. అలాగే తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ కార్యాలయంలో ఘంటా చక్రపాణి.. జీహెచ్‌ఎంసీ కార్యాలయంలో.. జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ జనార్దన్‌రెడ్డి జాతీయ పతకాన్ని ఎగురవేశారు.శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో సీఈవో ఎస్‌జీకే కిషోర్‌ జెండాను ఆవిష్కరించారు.

రిపబ్లిక్‌ డే.. సందర్భంగా.. చంచల్‌గూడ జైళ్ల శాఖ మైదానంలో డీజీ వినయ్‌ కుమార్‌ సింగ్‌ జాతీయ జెండాను ఆవిష్కరించి.. విధుల్లో ప్రతిభ కనబరిచిన ఉద్యోగులకు అవార్డులు అందజేశారు. అలాగే గచ్చిబౌలిలోని సైబరాబాద్‌ కమిషనరేట్‌ కార్యాలయంలో కలెక్టర్‌ రఘునందన్ రావు.. జెండాను ఆవిష్కరించి గణతంత్ర వేడుకలను ఘనంగా నిర్వహించారు.

అదేవిధంగా... సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించిన గణతంత్ర వేడుకల్లో.. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం.. భాగమయ్యారు. జాతీయజెండాను ఆవిష్కరించి.. రాజ్యాంగ నిర్మాత బీఆర్‌ అంబేద్కర్‌ చేసిన కృషిని కొనియాడారు. టీజేఏసీ కార్యాలయంలోనూ రిపబ్లిక్‌ వేడుకలు ఘనంగా జరిగాయి. చైర్మన్‌ కోదండరామ్‌ జాతీయజెండాను ఎగురవేశారు. జనసేన పార్టీ కార్యాలయంలోనూ రిపబ్లిక్ డే సంబరాలు ఘనంగా జరిగాయి. పార్టీ అధినేత పవన్ కల్యాణ్ జాతీయ జెండాను ఆవిష్కరించి.. అందరికీ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలిపారు. అదే విధంగా... తెలంగాణాలోని అన్ని జిల్లాలలో... ప్రభుత్వ కార్యాయాల్లో రిపబ్లిక్‌ డే వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా.. ఉత్తమ ప్రతిభ కనబరిచిన అధికారులను ప్రశంసా పత్రాలను అందించడం జరిగింది. కామారెడ్డి జిల్లా.. నిజాంసాగర్‌ మండలకేంద్రంలో .. మనకోసం మనం అనే స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో వెయ్యి అడుగుల జాతీయజెండాను ఊరేగించారు.

ఏపీలోనూ... ప్రజలు జాతీయ జెండా ఆవిష్కరించి.. గణతంత్ర దినోత్సవాన్ని అట్టహాసంగా జరుపుకున్నారు. వేడుకల్లో భాగంగా వినూత్నంగా భారీ జాతీయ జెండాలను ఊరేగించారు. నెల్లూరు జిల్లా.. ఓజిలి మండలం సగుటూరులో వైసీపీ అధినేత జగన్మోహన్‌రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించి.. గౌరవ వందనం చేశారు. స్వీట్స్‌ పంచిపెట్టి ఆనందం వ్యక్తం చేశారు. అలాగే కడపలో .. నారాయణ పాఠశాల విద్యార్థులు దాదాపు 365 అడుగుల జాతీయ జెండాను ప్రదర్శించారు. కర్నూలు పోలీస్‌ పరేడ్‌ గ్రౌండ్‌లోనూ, కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలోనూ.. జాతీయ జెండాను ఆవిష్కరించారు. అదేవిధంగా.. పశ్చిమగోదావరి జిల్లా.. జంగారెడ్డి గూడెంలో విద్యా వికాస్‌ పాఠశాల విద్యార్థుల ఆధ్వర్యంలో 400 అడుగుల జాతీయ జెండాతో పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అదే విధంగా.. ఒంగోలు, విశాఖ, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలోనూ రిపబ్లిక్‌ డేను.. ఘనంగా నిర్వహించారు.

ప్రతి చోట గణతంత్ర దినోత్సవం .. ఉత్సాహంగా జరిగినప్పటికీ... కొన్ని చోట్ల చిన్న చిన్న లోపాలు తలెత్తాయి. భద్రాద్రి కొత్తగూడెం పాల్వంచ మున్సిపల్‌ కార్యాలయంలో.. శానిటేషన్ కార్మికులు రాకుండానే.. కమిషనర్‌ జెండా ఎగురవేయడంపై.. కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యాలయం ముందు కూర్చోని నిరసన తెలిపారు. అలాగే కామారెడ్డి జిల్లా.. ఎల్లారెడ్డిలో ఆర్డీవో కార్యాయలంలో జెండా ఎగురకపోవడంతో... ఆవిష్కరణలో కాస్త ఆలస్యం జరిగింది.

Don't Miss